భారత పేస్ బౌలర్ల ధాటికి లంక బ్యాటింగ్ కుప్పకూలింది. మహమ్మద్ షమి, సిరాజ్ లు నిప్పులు చెరిగే బంతులతో చెలరేగడంతో నేడు జరిగిన మ్యాచ్ లో లంకపై ఇండియా 302 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక పరుగుల ఖాతా ప్రారంభించకముందే పాథుమ్ నిశాంక వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ కరుణరత్నే కూడా డకౌట్ అయ్యాడు. వీరితో పాటు సదీర సమర విక్రమ, దుషాన్ హేమంత, దుష్మంత చమీర కూడా డకౌట్ గానే వెనుదిరిగారు. కుశాన్ రజిత-14; ఆంగ్లో మాథ్యూస్-12; మహీష్ తీక్షణ-12 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. 19.4 ఓవర్లలో 55 పరుగులకే చాపచుట్టింది.
భారత బౌలర్లలో షమీ-5; సిరాజ్-3; జడేజా, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు.
ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఇండియా నాలుగు పరుగులకే తొలి వికెట్ (కెప్టెన్ రోహిత్-4) కోల్పోయింది. శుభ్ మన్ గిల్ – విరాట్ కోహ్లీలు రెండో వికెట్ కు 189 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. గిల్ 92బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92; కోహ్లీ 94 బంతుల్లో 11 ఫోర్లతో 88 పరుగులు చేసి ఔటయ్యారు. శ్రేయాస్ అయ్యర్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడి 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 రన్స్ సాధించాడు. జడేజా-35; రాహుల్-21; సూర్య కుమార్ యాదవ్-12 పరుగులు చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక-5; చమీర ఒక వికెట్ పడగొట్టారు.
షమీకి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టు ఇండియా కావడం గమనార్హం.