India won the Series: వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో కూడా ఇండియా విజయం సాధించి సిరీస్ ను గెల్చుకుంది. ప్రసిద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ తో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇండియా 44 పరుగులతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెఎల్ రాహుల్ జట్టులోకి రావడంతో ఇషాన్ కిషన్ కు చోటు దక్కలేదు. అయితే రోహిత్ శర్మతో పాటు రిషభ్ పంత్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. ఇండియా 9 పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ (5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత 39వద్ద రెండో వికెట్ (రిషభ్-18) కోల్పోయింది. కోహ్లీ మరోసారి విఫలమై 18 పరుగులు మాత్రమే చేసి జట్టు స్కోరు 43 వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్-సూర్య కుమార్ యాదవ్ లు నాలుగో వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ త్రుటిలో అర్ధ సెంచరీ మిస్ చేసుకుని 49 వద్ద రనౌట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 64 పరుగులతో రాణించాడు. వాషింగ్టన్ సుందర్ -24; దీపక్ హుడా-29 పరుగులు చేశారు. దీనితో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 237 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో అల్జర్రి జోసెఫ్, ఒడియన్ స్మిత్ చెరో రెండు, రోచ్, హోల్డర్, అకియాల్ హోస్సేన్, ఫాబియన్ అల్లెన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 32 పరుగుల వద్ద తొలి వికెట్ (బ్రాండన్ కింగ్-18) కోల్పోయింది. ఆ కాసేపటికే మరో ఓపెనర్ డరెన్ బ్రావో (1) కూడా ప్రసిద్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. జత్తులో షమ్రా బ్రూక్స్-44; అకియల్ హొస్సేన్-34; ఓడియన్ స్మిత్-24 పరుగులతో కాస్త ఫర్వాలేదనిపించారు. 46 ఓవర్లలో 193 పరుగులకే విండీస్ ఆలౌట్ అయ్యింది. ఇండియా బౌలర్లలో ప్రసిద్ కృష్ణ నాలుగు; శార్దూల్ ఠాకూర్ రెండు; సిరాజ్, యజువేంద్ర చాహల్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో 2-0 తో ఇండియా ఆధిక్యం సంపాదించి సిరీస్ గెల్చుకుంది. మూడో వన్డే ఇదే స్టేడియంలో శుక్రవారం నాడు (ఫిబ్రవరి 11) జరగనుంది
నాలుగు వికెట్లతో రాణించిన ప్రసిద్ కృష్ణకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.
Also Read : ఏకైక టి-20లో కివీస్ మహిళల విజయం