భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేడు ఆగస్టు 23న జరుపుకుంటోంది. గత ఏడాది ఇదే రోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ని ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైంది.
చంద్రయాన్-3 మిషన్ నుండి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండింగ్ అయ్యింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం అధికారికంగా ఆగస్టు 23 తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ విక్రమ్ ల్యాండర్, చంద్రుని ఉపరితలంపై సేఫ్ గా దిగిన ప్రాంతానికి ‘శివశక్తి’ అని నామకరణం చేశారు.
చంద్రయాన్-3 మిషన్ విజయం ఇస్రో కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి. భారతదేశ అంతరిక్ష రంగంలో ఒక చారిత్రాత్మక మైలు రాయిగా కూడా నిలిచి పోతుంది. చంద్రుని దక్షిణ ధ్రువంలో ఇలాంటి ఓ రోవర్‌ను విజయ వంతంగా ల్యాండ్ చేసిన నాల్గవ దేశంగా భారత్ అవతరించింది.