పురుషుల ప్రపంచ కప్ హాకీ-2023లో పూల్ ‘బి’ నుంచి ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకోగా, ఇండియా రెండో స్థానంలో నిలిచి క్రాస్ ఓవర్స్ లో చోటు దక్కించుకుంది. నేడు జరిగిన మ్యాచ్ ల్లో స్పెయిన్ పై ఇంగ్లాండ్ 4-0తో; వేల్స్ పై ఇండియా 4-2 తో విజయం సాధించాయి.
భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరిగిన ఈ పోటీల తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ 11వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా స్కోరు బోణీ కొట్టింది. ఆ తర్వాత 22, 51, 52 నిమిషాల్లో మూడు ఫీల్డ్ గోల్స్ చేసింది. ఆట ముగిసే సమయానికి 4-0తో విజయం సాధించింది.
ఫిల్ రోపర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
రెండో మ్యాచ్ లో 22వ నిమిషం వద్ద పెనాల్టీ కార్నర్ ద్వారా ఇండియా తొలి గోల్ సాధించింది, 33వ నిమిషం వద్ద ఆకాష్ దీప్ సింగ్ ఫీల్డ్ గోల్ చేశాడు. అయితే 43,45 నిమిషాల వద్ద వేల్స్ జట్టు రెండు పెనాల్టీ కార్నర్ గోల్స్ సాధించి ఇండియా శిబిరంలో ఆందోళన రేకెత్తించింది. అయితే చివరి పావు భాగంలో 46 వ నిమిషం వద్ద ఆకాష్ దీప మరో ఫీల్ గోల్ చేసి ఇండియాను మళ్ళీ ఆధిక్యంలోకి తీసుకెళ్ళాడు. చివరి క్షణాల్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ మరో పెనాల్టీ కార్నర్ గోల్ తో ఆధిక్యాన్ని 4-2కు పెంచాడు.
ఆకాష్ దీప్ సింగ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
క్వార్టర్స్ లో స్థానం కోసం ఈ నెల 24 న ఇండియా జట్టు న్యూ జిలాండ్ తో తలపడనుంది.