‘Klass’en: ఇండియాతో జరిగిన రెండో టి 20 లో కూడా సౌతాఫ్రికా 4 వికెట్లతో విజయం సాధించింది. గెలుగు ఖాయమనుకున్న గత మ్యాచ్ లో డస్సేన్ విధ్వంస బ్యాటింగ్ తో మ్యాచ్ చేజారగా, నేడు వికెట్ కీపర్ హీన్రిచ్ క్లాసేన్ చెలరేగి ఆడడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు. క్లాసేన్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులు చేసి విజయం ముంగిట ఔటయ్యాడు. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్ జట్టు మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి గెలుపు సొంతం చేసుకుంది. 29 పరుగులకే మూడు వికెట్లు (హెండ్రిక్స్-4; ప్రెటోరియస్-4; డస్సేన్-1)n కోల్పోయిన స్థితిలో కెప్టెన్ బావుమా- క్లాసేన్ లు ఇన్నింగ్స్ చక్కదిద్ది నాలుగో వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బావుమా-35 పరుగులు చేసి అవుట్ కాగా, డేవిడ్ మిల్లర్ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ఈ మ్యాచ్ లో తొలి మూడు వికెట్లూ భువీకే దక్కడం విశేషం. చివర్లో పార్నెల్ ను కూడా అవుట్ చేసి మొత్తం నాలుగు వికెట్లు సాధించాడు. హర్షల్ పటేల్, చాహల్ కు చెరో వికెట్ దక్కింది.
ఓడిశా, కటక్ లోని బారాబతి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జట్టులో మార్పులేమీ లేకుండానే బరిలోకి దిగిన ఇండియా మూడు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ మరోసారి విఫలమై కేవలం ఒక పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్- శ్రేయాస్ అయ్యర్ రెండో వికెట్ కు 45 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్-34; శ్రేయాస్ అయ్యర్-40 పరుగులతో రాణించారు. కెప్టెన్ పంత్(5); హార్దిక్ పాండ్యా(9); అక్షర్ పటేల్(10) విఫలమయ్యారు. చివర్లో దినేష్ కార్తీక్ 21 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హర్షల్ పటేల్ 12 పరుగులు చేశాడు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా బౌలర్లలో నార్త్జ్ కు రెండు; రబడ, పార్నెల్, ప్రెటోరియస్, కేశవ్ మహారాజ్ లకు తలా ఒక వికెట్ దక్కింది.
క్లాస్ ఇన్నింగ్స్ తో విజయంలో కీలక పాత్ర పోషించిన క్లాసేన్ కే మ్యాన్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
ఐదు మ్యాచ్ ల సిరీస్ లో సౌతాఫ్రికా 2-0తో ఆధిక్యంలో ఉంది. మూడో టి 20 విశాఖలో ఎల్లుండి 14న జరగనుంది.
Also Read : సౌతాఫ్రికా అద్భుత విజయం