టి 20 వరల్డ్ కప్ లో వరుసగా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించిన ఇండియా మహిళలు నేడు ఇంగ్లాండ్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. 152 పరుగుల లక్ష్య సాధనలో భారత మహిళలు 20 ఓవర్లకు 5 వికెట్లు 140 పరుగులు చేయగలిగారు.
టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. రేణుకా సింగ్ అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ 29 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. తర్వాత… నటాలి స్కివర్-50; అమీ జోన్స్-40; కెప్టెన్ హైదర్ నైట్ 28 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 స్కోరు చేసింది. రేణుక మొత్తం ఐదు వికెట్లు పడగొట్టగా, శిఖా పాండే, దీప్తి శర్మ లకు చెరో వికెట్ దక్కింది.
స్మృతి మందానా ధాటిగా ఆడుతున్నా సహచరులు వెంట వెంట ఔటయ్యారు. షఫాలీ (8); జెమైమా రోడ్రిగ్యూస్ (13); కెప్టెన్ హర్మన్ ప్రీత్ (4) విఫలమయ్యారు. స్మృతి-రిచా ఘోష్ లు నాలుగో వికెట్ కు 43 పరుగులు జోడించారు. 41 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 52 పరుగులు చేసిన స్మృతి 105 పరుగుల వద్ద ఔటయ్యింది. దీప్తి శర్మ 7 పరుగులు చేసి రనౌట్ కాగా, రిచా ఘోష్ చివర్లో మెరుపు షాట్లు ఆడినా ప్రయోజనంలేకుండా పోయింది. రిచా 34 బంతుల్లో 4 ఫోర్లు. 2 సిక్సర్లతో 47 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో సారా గ్లెన్ రెండు; ఎక్సెల్ స్టోన్, లారెన్ బెల్ చెరో వికెట్ సాధించారు.
నటాలి స్కివర్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.