మహిళల హాకీ వరల్డ్ కప్-2022లో ఇండియా కథ ముగిసింది. కనీసం క్వార్టర్ ఫైనల్స్ కు చేరకుండానే వెనుదిరిగింది… నిన్న (భారత కాలమానం ప్రకారం గత అర్ధరాత్రి) జరిగిన క్రాస్ ఓవర్ మ్యాచ్ లో స్పెయిన్ పై 1-0తో ఓటమి పాలైంది. ఆట 57వ నిమిషంలో స్పెయిన్ క్రీడాకారిణి మార్త సేగు అందించిన ఫీల్డ్ గోల్ తో ఆ జట్టు విజయం సాధించి క్వార్టర్స్ కు చేరుకుంది.
లీగ్ మ్యాచ్ ల్లో నాలుగు పూల్స్ నుంచి లీడింగ్ లో ఉన్న 4 జట్లు నేరుగా క్వార్టర్స్ కు చేరుకోగా, నాలుగు పూల్స్ నుంచి రెండు, మూడు స్థానాల్లో నిలిచిన 8 జట్లూ క్వార్టర్స్ లో మిగిలిన నాలుగు స్థానాల కోసం క్రాస్ ఓవర్ మ్యాచ్ ల్లో తలపడ్డాయి.
ఆతిథ్య నెదర్లాండ్స్, న్యూజిలాండ్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా జట్లు లీగ దశ నుంచే క్వార్టర్స్ కు చేరుకోగా, క్రాస్ ఓవర్ మ్యాచ్ ల నుంచి కెనడా, బెల్జియం, ఇంగ్లాండ్, స్పెయిన్ జట్లు టాప్ 8 కు చేరుకున్నాయి.
9 నుంచి 16 స్థానాల కోసం జరిగే పోటీల్లో భాగంగా ఇండియా నేడు కెనడాతో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 9.30గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.