Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్IND Vs. WI: రెండో టి 20 లోనూ విండీస్ దే విజయం

IND Vs. WI: రెండో టి 20 లోనూ విండీస్ దే విజయం

ఇండియాతో స్వదేశంలో జరుగుతోన్న టి20 సిరీస్ లో రెండో మ్యాచ్ లోనూ విండీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థి ముందు భారీ స్కోరు ఉంచడంలో ఇండియా మరోసారి విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసి 152  పరుగులు చేయగా,  ఈ లక్ష్యాన్ని విండీస్ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి సాధించింది.

గయానా ప్రొవిడెన్స్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 18 పరుగులకే తొలి రెండు వికెట్లూ కోల్పోయింది. శుభ్ మన్ గిల్ (7); ఫస్ట్ డౌన్ లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (1) మరోసారి విఫలమయ్యారు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 2  సిక్సర్లతో 27 పరుగులు చేసిన మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ జట్టు స్కోరు 60 వద్ద ఔటయ్యాడు. సంజూ శామ్సన్ (7) కూడా నిరాశ పరిచాడు.  తెలుగు స్టార్ తిలక్ వర్మ మరోసారి సత్తా చాటి 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 51  పరుగులు చేసి ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా-24; అక్షర్ పటేల్-14 పరుగులు చేసి ఔట్ కాగా, రవి బిష్ణోయ్-8; అర్ష్ దీప్ సింగ్- 6 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152  స్కోరు చేసింది.

విండీస్ బౌలర్లలో అకీల్ హోస్సేన్ , అల్జారీ జోసెఫ్, రోమానియో షెఫర్డ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

లక్ష్య సాధనలో  హార్దిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. బ్రాండన్ కింగ్ డకౌట్ కాగా, జేమ్స్ ఛార్లెస్ 2 పరుగులే చేశాడు. కేల్ మేయర్స్ 15 రన్స్ చేసి 32 వద్ద ఔటయ్యాడు. ఈ దశలో నికోలస్ పూరన్- పావెల్ నాలుగో వికెట్ కు 57 పరుగులు జోడించాడు. పావెల్ 19 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్ తో 21 పరుగులు చేయగా, పూరన్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో  67 పరుగులు చేశాడు. చాహల్ వేసిన 16వ ఓవర్లో  హెట్మెయిర్  (21); షెఫర్డ్ (డకౌట్); హోల్డర్(డకౌట్).. మూడు వికెట్లు కోల్పోవడంతో ఇండియా మ్యాచ్ పై పట్టు సాధించినట్లు అనిపించింది. కానీ అకీల్ హోసేన్-16, అల్జారీ జోసెఫ్-10 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును గెలిపించారు.

ఇండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 , చాహల్ 2; అర్ష్ దీప్, ముఖేష్ చెరో వికెట్ పడగొట్టారు.

నికోలస్ పూరన్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-0 ఆధిక్యంలో విండీస్ ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్