ఇంగ్లాండ్ తో జరిగిన లండన్ ఓవల్ టెస్టులో 157 పరుగులతో ఇండియా ఘనవిజయం సాధించింది. బౌలర్లు సమిష్టిగా రాణించి అపూర్వ విజయాన్ని అందించారు. విజయానికి 368 పరుగులు చేయాల్సి ఉండగా 210 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. ఈ విజయం ద్వారా మూడో టెస్టులో ఎదురైన ఘోర పరాభవానికి ఇండియా బదులు తీర్చుకుంది. ఉమేష్ యాదవ్-3, జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
వికెట్ నష్టపోకుండా 77 పరుగులతో ఐదోరోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్ జట్టుస్కోరు 100 వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 120, 141, 146, 146, 147 పరుగుల వద్ద వరుస వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ జో రూట్, క్రిస్ ఓక్స్ లు కాసేపు ఇండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. 182 పరుగుల వద్ద జో రూట్ వికెట్ కోల్పోవడంతో ఇండియా శిబిరంలో గెలుపుపై ధీమా వచ్చింది. 193, 202 స్కోరు వద్ద ఇంగ్లాండ్ 8, 9 వికెట్లను కోల్పోయింది. 210 పరుగుల వద్ద ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో జేమ్స్ అండర్సన్ అవుట్ కావడంతో ఇండియా విజయం ఖరారైంది.
రెండో ఇన్నింగ్స్ లో 127 పరుగులతో రాణించిన ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఐదు టెస్టుల సిరీస్ లో ఇండియా 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. ఆఖరి టెస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 10 నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.