జింబాబ్వేతో జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ పరాజయానికి ఇండియా గట్టిగా బదులిచ్చింది. నేడు జరిగిన రెండో టీ20లో జింబాబ్వేపై 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాదీ స్టార్ అభిషేక్ శర్మ సత్తా చాటి 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ చేసి తన సత్తా చాటాడు. బౌలింగ్ లో అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ చెరో 3; రవి బిష్ణోయ్ 2 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. గిల్ 2 పరుగులకే ఔటైనా…రెండో వికెట్ కు అభిషేక్- రుతురాజ్ గైక్వాడ్ లు 137 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. అభిషేక్ సెంచరీ పూర్తి కాగానే పెవిలియన్ చేరగా… రుతురాజ్- రింకూ సింగ్ లు అజేయంగా 87 పరుగుల మరో చక్కని పార్టనర్ షిప్ నమోదు చేశారు. రుతురాజ్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్ తో 77; రింకూ 22 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 48 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. వెస్లీ మదేవేరే-47; బ్రెయిన్ బెన్నె-26; లుక్ జోంగ్వె -33 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అభిషేక్ శర్మకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.
ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ 1-1 తో సమం అయ్యింది.