Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Indianisms: The creative use of ‘Indian-English’

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీలో యోగేంద్ర యాదవ్ ఒక వ్యాసం రాశారు. ఇంగ్లీషు భాష భారతీయకరణం కావాలి అన్నది ఈ వ్యాసంలో ఆయన ప్రతిపాదన. మధ్యలో ఎక్కడో దక్షిణాది భాషల్లో గొప్ప గొప్ప సామాజిక, తాత్విక విషయాలను వ్యక్తపరచడం సాధ్యం కాదని ఎవరో ఒక ఇంగ్లీషు రచయిత్రి అన్నట్లు ఒక ప్రస్తావన ఉంది. ఆమెకు, ఆ మాటను యథాతథంగా కోట్ చేసిన యోగేంద్రకు ఇద్దరికీ దక్షిణాది భాషల గురించి తెయదనుకుని వదిలేస్తే…మిగతా వ్యాసమంతా చాలా లోతయిన చర్చ.

తెలుగు భాష ఒకటే అయినా యాసలు అనేకం. ఒక్కో జిల్లాలోనే నాలుగయిదు యాసలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో హిందూపురం , మడకశిర, గోరంట్లల్లో కన్నడ ఉచ్చారణతో కూడిన తెలుగు యాస. కదిరిలో కడప యాస. గుత్తిలో కర్నూలు యాస. అనంతపురం, ధర్మవరం, పెనుకొండలో ఒక యాస. ఇంకా లోతుగా వెళితే కులాలు, వృత్తులను బట్టి యాసల్లో మరి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. భాష, యాసల మీద దృష్టి ఉన్నవారు రెండు మాటలు వినగానే అది ఏ ప్రాంతం యాసో చెప్పగలుగుతారు. చెప్పినారు
చేసినారు
రాసినారు
పాడినారు
లాంటి మాటలతో స్థూలంగా రాయలసీమ యాస ఒకటే అయినా నాలుగు జిల్లాలకు నాలుగు రకాల ఉచ్చారణ విడిగా ఉంది.

అలాగే ఇంగ్లీషు కూడా రాసే భాష ఒకటే అయినా మాట్లాడే భాష మాత్రం ఏ దేశానికి ఆ దేశపు ఉచ్చారణతో స్థిరపడింది. బ్రిటన్లోనే రెండు, మూడు సంప్రదాయాలున్నాయి. అమెరికా ఇంగ్లీషు హడావుడి అంతా ఇంతా కాదు. చైనీయులు ఇంగ్లీషును చైనాలాగే మాట్లాడతారు. జపాన్ వారు ఇంగ్లీషును జపాన్ లానే ఉచ్ఛరిస్తారు. అలాగే భారతీయులు ఇంగ్లీషును వారి వారి మాతృ భాషల ఉచ్చారణ ప్రకారమే ఉచ్ఛరిస్తారు.

కార్
ఫోన్
బస్ మాటలను తెలుగువారు డు ము వు లు విభక్తుల మౌలిక వ్యాకరణ సూత్రం ప్రకారం
కారు
ఫోను
బస్సు అనే పలుకుతారు. తెలుగులో ఆ మాటలను వాడేప్పుడు కారు బస్సు అంటే పెద్ద పట్టింపు ఉండదు. అదే తెలుగువారు ఇంగ్లీషులో మాట్లాడేప్పుడు బస్సు అనడానికి వీల్లేదు. థౌజండ్ అన్న మాటను తమిళులు ఎవరయినా థౌసండ్ అనే అంటారు. పరుషాలన్నీ వారికి సరళాలు కావడంతో వచ్చిన ఉచ్చారణ భేదమిది. ఒరియావారెవరయినా కాంపెన్సేసన్ అనే అంటారు. బెంగాలీలు ఇంగ్లీషును బెంగాలీ పద్ధతిలోనే పలుకుతారు. హిందీ మాతృ భాష వారు చాలా ఇంగ్లీషు మాటలను ఒక ప్రత్యేక పద్ధతిలో మాట్లాడతారు. మన ప్రధాని మోడీ ఇంగ్లీషు మాటలు పలికేప్పుడు కూడా ఎన్నో మాటల్లో ఒక ప్రత్యేకమయిన యాస ధ్వనిస్తుంది. అర్థభేదం రానంతవరకు దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు.

ఇలా మాట్లాడడాన్ని అవమానంగా భావిస్తూ బ్రిటన్ ఇంగ్లీషు కోసం వెంపర్లాడడం మీద యోగేంద్ర యాదవ్ చక్కటి ఉదాహరణలతో వ్యాసం రాశారు.

ఇంగ్లీషులో ఏ యాస గొప్పది అన్న ప్రశ్నకు మనకు మనమే బ్రిటన్ లేదా అమెరికా అని సమాధానం చెప్పుకోవడం వల్ల వచ్చిన చిక్కు ఇది. భుజాలెగరేస్తూ టైమ్ మిషన్లో యుగాల స్పీడ్ తో తిరిగినట్లు అత్యంత వేగంగా మాటలను కలిపి పలికే అమెరికా ఇంగ్లీషు కోసం మనం పడి చస్తాం. లేదా శశి థరూర్ లా ఇంగ్లీషు వాడే స్పృహ దప్పి పడేలా నిఘంటువులు కూడా అర్థం చెప్పలేక చేతులెత్తేసే నోరు తిరగని ఇంగ్లీషు మాటలు మాట్లాడాలని ప్రయత్నిస్తాం.

ఫైనాన్స్ అని ఒకరంటే ఫినాన్స్ అని మరొకరంటారు. డైరెక్టర్ అని ఒకరంటే డిరెక్టర్ అని మరొకరంటారు. పదుగురాడు మాట పాడియై ధరజెల్లు…అన్నట్లు ఎక్కువమంది ఎలా పలికితే అదే ప్రామాణికమై కూర్చుంటుంది. మాతృ భాష కానప్పుడు పరాయి భాషలో ఎంతటి ప్రావీణ్యం సంపాదించినా దానికి కొన్ని పరిమితులు తప్పనిసరిగా ఉంటాయి. ఆ పరిమితుల దగ్గరే ఆగిపోకుండా…అర్థంలో తేడా రానంతవరకు అంగీకరించి ముందుకు కదలడమే శ్రేయస్కరం.

దీనికి సంబంధించినదే మరో విషయం.
మిజోరాం రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శిని ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించుకుంది. ఆయన వద్దు…ఈయనను నియమించండి అని కేంద్రం ఇంకో ఐ ఏ ఎస్ అధికారిని కూర్చోబెట్టింది. కొత్త అధికారికి ఇంగ్లీషు, హిందీ తప్ప మరో భాష తెలియదు. మిజో మంత్రులకు హిందీ ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అధికారికి మిజో భాష తెలియదు. దాంతో మూగభాషలో పాతరాతియుగం సైగలతో చెబుతున్నాం…ఈయనను మార్చి మిజో తెలిసిన అధికారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించండి మహాప్రభో అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర హోం శాఖను అభ్యర్థిస్తూ అధికారికంగా లేఖ రాశారు.

ఇదివరకు తప్పుల్లేకుండా చక్కగా ఇంగ్లీషు రాయడం, మాట్లాడ్డం వస్తే సరిపోయేది. ఇప్పుడలా కాదు. అసలు సిసలు ఇంగ్లీషు వారు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాలని భారతీయ విద్యావంతులు ఆయాసపడుతున్నారని యోగేంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నంలో చిత్ర విచిత్రాలను, కృత్రిమత్వాన్ని ఆయన సోదాహరణంగా వివరించారు. భారతీయ ఇంగ్లీషు అని మన ఇంగ్లీషును మనమే గుర్తించి, గౌరవించుకోకపోతే…రెంటికీ చెడ్డ రేవళ్లమవుతాం.సారీ…
భాషల విషయంలో అన్నిటికీ చెడ్డ రేవళ్ళమెప్పుడో అయ్యాం. ఇప్పుడు కొత్తగా చెడిపోవడానికి ఏమీ మిగల్లేదు.

మనకు ఇంగ్లీషే ముద్దు. ఆ ఇంగ్లీషులో కూడా బ్రిటన్ మీదుగా అమెరికా వెళ్లిన ఇంగ్లీషు యాసే ముద్దు.

అందుకే…
యాక్చువల్లీ మన కిడ్స్ సాంస్క్రిట్ శ్లోకాస్ టెల్గూలో ఎక్స్ ప్లయిన్ చేస్తా ఉంటే…ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో వర్డ్స్ లో ఎక్స్ ప్రెస్ చేయలేం! ఇట్స్ అమేజింగ్ దట్ అవర్ కిడ్స్ ఆఫెన్ స్పీక్ ఇన్ అవర్ ఓన్ మదర్ టంగ్!!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

గాడ్స్ మదర్ టంగ్

Also Read:

లిపిని చంపుదాం రండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com