ICC Under 19 Womens T20 World Cup 2023: కెప్టెన్ షఫాలీ వర్మతో పాటు ఓపెనర్ శ్వేత షెరావత్, రిచా ఘోష్ రాణించడంతో మహిళల అండర్ -19 టి20 వరల్డ్ కప్ లో వరుసగా రెండో మ్యాచ్ లో కూడా ఇండియా ఘన విజయం సాధించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై 122 పరుగుల భారీ తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా బెన్నోయ్ లోని విల్లమూరు పార్క్ మైద్నానంలో జరిగిన ఈ మ్యాచ్ లో యూఏఈ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
షెరావత్- షఫాలీ తొలి వికెట్ కు 111 పరుగులు చేశారు. 34 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులు చేసిన షఫాలీ తొలి వికెట్ గా వెనుదిరిగింది. రిచా ఘోష్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేసి ఒక్క పరుగుతో అర్ధ సెంచరీ మిస్ చేసుకుంది. తెలుగమ్మాయి గొంగడి త్రిష 11 రన్స్ చేసి అవుట్ కాగా, షెరావత్ 49 బంతుల్లో 10 ఫోర్లతో 74 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
భారీ లక్ష్య సాధలనో యూఏఈ విఫలమైంది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో షబ్నం, సాధు, మన్నత్ కశ్యప్, పర్షవి చోప్రా తలా ఒక వికెట్ పడగొట్టారు.
షఫాలీ వర్మకే మ్యాన్ అఫ్ ద మ్యాచ్ లభించింది.
ఇండియా తన తర్వాతి మ్యాచ్ లో స్కాట్లాండ్ తో తలపడనుంది.