మహిళల టి20 ఆసియా కప్ -2022 లో ఇండియా హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. నేడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో 104పరుగులతో ఘన విజయం సాధించింది. షిల్హెట్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
హర్మన్ ప్రీత్ కౌర్ కు విశ్రాంతి ఇచ్చారు, ఆమె స్థానంలో స్మృతి మందానా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టింది. ఇండియా 19 పరుగులకే మూడు వికెట్లు (రిచా ఘోష్ డకౌట్; సబ్బినేని మేఘన-10; హేమలత-2) కోల్పోయింది. ఈ దశలో దీప్తి శర్మ- రోడ్రిగ్యూస్ లు నాలుగో వికెట్ కు 129 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. దీప్తి శర్మ 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 64; జెమీమా రోడ్రిగ్యూస్ మరోసారి సత్తా చాటి 45 బంతుల్లో 11 ఫోర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 178 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోగి దిగిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 74 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజేశ్వరి గాయక్వాడ్ రెండు; దయాలన్ ఒక వికెట్ సాధించారు.
రోడ్రిగ్యూస్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఇండియా మహిళలు తమ తర్వాతి మ్యాచ్ ను శుక్రవారం దాయాది దేశం పాకిస్తాన్ తో ఆడనుంది.