Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్రాణించిన నితీష్ కుమార్ రెడ్డి: పంజాబ్ పై హైదరాబాద్ విజయం

రాణించిన నితీష్ కుమార్ రెడ్డి: పంజాబ్ పై హైదరాబాద్ విజయం

పంజాబ్ కింగ్స్ తో నేడు జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు పరుగులు తేడాతో విజయం సాధించింది. సులభంగా గెలవాల్సిన మ్యాచ్ ను హైదరాబాద్ తన ఫీల్డింగ్ వైఫల్యంతో సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్  బ్యాట్స్ మెన్ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు చావో రేవో అన్నట్లుగా ఆడి ఏడో వికెట్ కు 27 బంతుల్లో అజేయంగా 66  పరుగులు చేయడం విశేషం. జయ దేవ్ ఉనాద్కత్ వేసిన చివరి ఓవర్లో విజయానికి 29 పరుగులు అవసరం కాగా వీరిద్దరూ 23 పరుగులు రాబట్టారు, మరో 3 పరుగులు వైడ్స్ రూపంలో అదనంగా వచ్చాయి. చివరకు 2 పరుగుల స్వల్ప తేడాతో హైదరాబాద్ గట్టెక్కగలిగింది.

పంజాబ్ లోని ముల్లాన్ పూర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 27 వద్ద అర్ష్ దీప్ బౌలింగ్ లో వరుస బంతుల్లో రెండు వికెట్లు (ట్రావిస్ హెడ్-21; ఏడెన్ మార్ క్రమ్ డకౌట్) హైదరాబాద్ కోల్పోయింది. ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ కూడా 16 పరుగులే చేసి వెనుదిరిగాడు. రాహుల్ త్రిపాఠి-11; హెన్రిచ్ క్లాసేన్-9 లు కూడా విఫలమయ్యారు. ఈ దశలో నితీష్ కుమార్ రెడ్డి అబ్దుల్ సమద్ తో కలిసి ఆరో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు. సమద్ 12 బంతుల్లో 5 ఫోర్లతో 25; నితీష్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 రన్స్ చేసి ఔటయ్యారు. షాబాజ్ అహ్మద్ 12; కమ్మిన్స్ 3; భువనేశ్వర్ 6; ఇన్నింగ్స్ చివరి బంతికి ఉనాద్కత్ సిక్సర్ కొట్టడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.  పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 4; సామ్ కర్రన్, హర్షల్ పటేల్ చెరో రెండు; రబడ ఒక వికెట్ పడగొట్టారు.

పంజాబ్ 20 పరుగులకే మూడు కీలక వికెట్లు (బెయిర్ స్టో డకౌట్, ప్రభ్ సిమ్రాన్ సింగ్-4; ధావన్-14) కోల్పోయి కష్టాల్లో పడింది. కర్రన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29; సికిందర్ రాజా 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. జితేష్ శర్మ 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్ తో 19 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత శశాంక్ సింగ్, అశుతోష్ లు చివరి వరకూ విజయం కోసం పోరాడారు.

హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 2; కమ్మిన్స్, నటరాజన్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ తలా ఒక వికెట్ సాధించారు.

64 పరుగులతో పాటు ఒక వికెట్ కూడా సాధించిన నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్