శ్రేయాస్ అయ్యర్ రాణించడంతో నేడు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ విజయం సాధించింది. లక్ష్యం చిన్నదే అయినా త్వరగా సాధించాలన్న తపనతో ఢిల్లీ త్వరగా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్ నిలదొక్కుకొని విజయం దిశగా జట్టును నడిపించాడు. అయ్యర్ 33 బంతుల్లో రెండు ఫోర్లతో 33 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీనితో ఢిల్లీ ఐదు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ మరోసారి బ్యాటింగ్ లో విఫలమైంది. సూర్య కుమార్ యాదవ్-33 (26 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు); డికాక్-19 (18బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్ ) మాత్రమే రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ఆవేష్ ఖాన్, అక్షర్ పటేల్ చెరో మూడు వికెట్లు, నర్త్జే, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఢిల్లీ 14 పరుగుల వద్దే శిఖర్ ధావన్ రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే మరో ఓపెనర్ పృథ్వీ షా కూడా ఔటయ్యాడు. కెప్టెన్ రిషభ్ పంత్ 26 పరుగులతో (22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. హెట్మెయిర్ -15 పరుగులు చేశాడు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ అయ్యర్ తో కలిసి 20 పరుగులతో అజేయంగా నిలిచాడు.
నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన ఢిల్లీ బౌలర్ అక్షర్ పటేల్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.