ఈ ఐపీఎల్ సీజన్ ను పంజాబ్ విజయంతో ముగించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నైపై ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించింది. పంజాబ్ కెప్టెన్ కే.ఎల్.రాహుల్ సిక్సర్లతో స్టేడియాన్ని మోత మోగించాడు. కేవలం 42 బంతుల్లో 7ఫోర్లు, 8సిక్సర్లతో 98 పరుగులతో అజేయంగా నిలిచి పొట్టి ఫార్మాట్ లో మరోసారి తన సత్తా చాటాడు. రాహుల్ మెరుపు ఆటతో మరో ఏడు ఓవర్లు మిగిలి ఉండగానే పంజాబ్ లక్ష్యాన్ని సాధించింది.
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ 18 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ 12 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ డూప్లెసిస్ వేగంగా ఆడుతున్నా అతనికి మిగిలిన బ్యాట్స్ మెన్ నుంచి సహకారం కరువైంది. మొయిన్ ఆలీ(0), రాబిన్ ఊతప్ప(2), అంబటి రాయుడు(4) విఫలమయ్యారు. కెప్టెన్ ధోనీ-12, రవీంద్ర జడేజా-15 పరుగులు మాత్రమే చేశారు. 55 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేసిన డూప్లెసిస్ ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఆరువికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో హర్ష్ దీప్ సింగ్, క్రిస్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు, షమి, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.
పంజాబ్ ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్ తొలి వికెట్ కు 46 పరుగులు చేశారు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో అగర్వాల్ (12) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫ్ రాజ్ డకౌట్ అయ్యాడు. పంజాబ్ ఇన్నింగ్స్ లో రాహూల్ వన్ మ్యాన్ షో ప్రదర్శించాడు. పంజాబ్ చేసిన 139 పరుగుల్లో రాహుల్ వాటా 98 పరుగులు అంటే… చెన్నై బౌలర్లతో పాటు పంజాబ్ బ్యాట్స్ మెన్ కూడా రాహుల్ ఆట చూస్తూ ప్రేక్షకుల్లాగానే మిగిలిపోవాల్సి వచ్చింది. పదమూడో ఓవర్ చివరి బంతిని సిక్సర్ గా మలిచి విజయం నమోదు చేశాడు రాహుల్.
రాహూల్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.