రాజస్థాన్ బ్యాటింగ్ విధ్వంసానికి దుబాయి లోని షేక్ జావేద్ స్టేడియం దద్దరిల్లింది. నేడు జరిగిన మరో ఐపీఎల్ మ్యాచ్ లో మొదటి ఓవర్ నుంచే అమీ తుమీ తేల్చుకునే రీతిలో ఎదురు దాడి ఆరంభించింది. ముఖ్యంగా రాజస్థాన్ బ్యాట్స్ మెన్ యశస్వి, శివం దుబే శివాలెత్తి ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ విసిరిన 190 పరుగుల విజయ లక్ష్యాన్నిరాజస్థాన్ రాయల్స్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 17. 3 ఓవర్లలోనే అవలీలగా ఛేదించి సాధించి తమ సత్తా చాటింది. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అజేయ సెంచరీ, చివర్లో జడేజా మెరుపు ఇన్నింగ్స్ వృథాగా పోయింది. రాజస్థాన్ ఓపెనర్లు లూయీస్, యశస్వి జైపాల్ లు మొదటి ఓవర్ నుంచే వారి ఎదురు దాడి మొదలు పెట్టారు. తొలి వికెట్ కు ఆరు ఓవర్లలోనే 77 పరుగులు జోడించి జట్టు గెలుపుకు రాచబాట వేశారు. లూయీస్ 27 (12 బంతుల్లో 2ఫోర్లు,2 సిక్సర్లు) చేసి ఔటయ్యాడు. యశస్వి 21 బంతుల్లో 6ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ చేసి ఆసిఫ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. కెప్టెన్ సంజూ శ్యాంసన్ 28 పరుగులు చేశాడు. శివం దుబే 42 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నై బౌలర్లో శార్దూల్ ఠాకూర్-2, ఆసిఫ్ ఒక వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు, టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శ్యామ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, డూప్లెసిస్ ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించారు. మొదటి వికెట్ కు 47 పరుగులు జోడించారు. 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 25 పరుగులు చేసి డూప్లెసిస్ ఔటయ్యాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన రైనా నిరాశపరిచి మూడు పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ రుతురాజ్ కు చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంబటి రాయుడు రెండు పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా రుతురాజ్ తో జత కలిసి రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. చివరి రెండు ఓవర్లలో 93 పరుగులతో క్రీజులో ఉన్న రుతురాజ్ సెంచరీ చేస్తాడా లేదా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూశారు. 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న రుతురాజ్ చెన్నై ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్సర్ గా మలిచి ఐపీఎల్ కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101; రవీంద్ర జడేజా 15 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ తో 32 పరుగులతో అజేయంగా నిలిచారు. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో తెవాటియా-3; చేతన్ సకారియా ఒక వికెట్ పడగొట్టారు.
రుతురాజ్ గైక్వాడ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది