ఈ ఐపీఎల్ లో హైదరాబాద్ మూడో విజయాన్ని నమోదు చేసింది. చివరివరకూ ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై నాలుగు పరుగులతో గెలిచింది. హైదరాబాద్ బౌలర్లు హోల్డర్, భువీ చివరి రెండు ఓవర్లూ అద్భుతంగా బౌల్ చేసి మ్యాచ్ తమ వైపు తిప్పారు. అబుదాబీ లోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు.
హైదరాబాద్ జట్టు స్కోరు 14 వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ జేసన్ రాయ్ తో కలిసి కెప్టెన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. రెండో వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 29 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసి విలియమ్సన్ ఔటయ్యాడు. జేసన్ రాయ్ 38 బంతుల్లో 5 ఫోర్లతో 44పరుగులు చేశాడు. ఆ తర్వాత ప్రియమ్ గార్గ్-15; హోల్డర్-16 పరుగులు చేశారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 141 పరుగులు చేసింది. బెంగుళూరు బౌలర్లలో హర్షల్ మూడు, క్రిస్టియన్ రెండు, జార్జ్ గార్దన్, యజువేంద్ర చాహల్ చెరో వికెట్ పడగొట్టారు.
142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు తొలి ఓవర్లోనే మొదటి వికెట్ కోల్పోయింది, ఐదు పరుగులు చేసిన కెప్టెన్ కోహ్లీ, భువనేశ్వర్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో ఓవర్లో క్రిస్టియన్, ఏడో ఓవర్లో శ్రీకర్ భరత్ ఔటయ్యారు. ఈ దశలో ఓపెనర్ దేవదత్ పడిక్కల్, గ్లెన్ మ్యాక్స్ వెల్ తో కలిసి నాలుగో వికెట్ కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయంపై ఆశలు రేకెత్తించారు. అయితే హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ విసిరిన చక్కటి బంతికి మ్యాక్ వెల్ రనౌట్ అయ్యాడు. ఓపెనర్ పడిక్కల్ కూడా ఔట్ కావడంతో బెంగుళూరు కష్టాల్లో పడింది. ఏబీ డివిలియర్స్ చివర్లో మెరిపించినా 19 వ ఓవర్లో హోల్డర్ కేవలం ఐదు పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండగా 8 పరుగులే బెంగుళూరు చేయగలిగింది. దీనితో నాలుగు పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. హైదరాబాద్ బౌలర్లు భువి, కౌల్, హోల్డర్, ఉమ్రాన్ మాలిక్, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
31 పరుగులు చేయడంతో పాటు రెండు క్యాచ్ లు, ఒక రనౌట్ చేసిన హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది