Sunday, November 24, 2024
HomeTrending Newsఇరాన్ వైఖరితో ముస్లిం సమాజంలో చిచ్చు

ఇరాన్ వైఖరితో ముస్లిం సమాజంలో చిచ్చు

ముస్లిం దేశాలకు నాయకత్వం వహించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు… దుస్సాహసంగా మారే విధంగా ఉన్నాయి. ఇస్లామిక్ దేశమే అయినా అనేక ఆచారాలు, సంప్రదాయాల కలబోత ఇరాన్. ఇక్కడ షియా వర్గం మెజారిటీగా ఉండగా సున్ని, పార్శీలు, యూదులు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, బహాయి, జుదాయిజం తదితర మైనారిటీలు ఉన్నారు.

ఇస్లామిక్ సమాజంలో మానవత్వపు పరిమళాలు పంచే సూఫీ ధర్మం ఇక్కడే ప్రారంభం అయింది. ప్రగతిశీల భావాలు కలిగిన ఇరాన్ లో సనాతన వాదులు అధికారంలోకి వచ్చాక సంస్కరణల పేరుతో కట్టుబాట్లు, ఆంక్షలు ప్రజల మీద రుద్దటం… ప్రజల నుంచి అదే స్థాయిలో వ్యతిరేకత పెరిగింది.

స్వదేశంలో పాలకుల విధానాలు వికటించగా… పొరుగు దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం ఇరాన్ ప్రారంభించింది. హమాస్, హిజ్బోల్లా ఉగ్రవాద సంస్థలకు ఆయుధ సంపత్తి అందించటం… ఇజ్రాయెల్ మీద ఇరాన్ యుద్ధోన్మాదం అంశాల్ని లోతుగా పరిశీలిస్తే విస్తుగోలిపే అంశాలు వెలుగు చూస్తున్నాయి. యూదు దేశమైన ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తామని అమెరికా, యూరోప్ క్రైస్తవ దేశాలు ముందుగానే ప్రకటించాయి.

పాలస్తీనా ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటామని కదనానికి కాలు దువ్వుతున్న ఇరాన్ కు సాటి ముస్లిం దేశాల నుంచి మద్దతు కరువైంది. తమ గగనతలాన్ని పాశ్చాత్య దేశాలకు ఇవ్వమని ఖతార్, సిరియాలు మొక్కుబడిగా ప్రకటించి తప్పుకున్నాయి. ఇరాన్ వదిలిన మిస్సైళ్ళను అమెరికా అడ్డుకోవటంలో మిత్ర ధర్మం ఉంది.

జోర్డాన్, సౌది అరేబియాలు ఇరాన్ మిస్సైళ్ళను నిలువరించాయి. తమ గగనతలం నుంచి వెళ్ళే క్రమంలో విఫలమైతే పౌరులకు నష్టం వాటిల్లుతుందని అడ్డుకున్నట్టు ఆ దేశాలు వివరణ ఇచ్చాయి. వినటానికి ఇది సొంపుగా ఉన్న అది తొంపు అని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పాలస్తీనా ముస్లిములలో సున్ని తెగ జనాభా మెజారిటీగా ఉంటుంది. ఇరాన్ లో షియాల ఆధిపత్యం. జోర్డాన్, సౌదీ అరేబియా లు సున్నీ దేశాలు. సున్ని-షియాల మధ్య శతాబ్దాల వైరం కొనసాగుతోంది. ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లో ఒకరిపై మరొకరి దాడుల వెనుక రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉంది.

పాలస్తీనా సున్ని ముస్లింలకు ఇరాన్ షియా ప్రభుత్వం సాయం చేయటంలో మర్మం ఉందని ముస్లిం మేధావులు భావిస్తున్నారు. సాటి ముస్లిం ప్రజలకు అండగా ఉండాలని… హిజ్బోల్లా ద్వారా సాయం అందించి క్రమేణా హమాస్ ను ఉగ్రవాద సంస్థగా మార్చే కుట్ర జరిగినదని అపవాదు ఉంది. ముస్లిం దేశాల కూటమికి నాయకత్వం వహించాలనే తాపత్రయం.. అమెరికా, పశ్చిమ దేశాలను ఎదుర్కునే వ్యూహం దాగి ఉంది.

ఇరాన్ వ్యూహాన్ని పసిగట్టిన ముస్లిం దేశాల పెద్దన్న సౌది అరేబియా ఇరాన్ పై అమెరికా ఆంక్షలను ఏనాడు ఖండించలేదు. ఇప్పుడు అమెరికాకు సాయంగా ఇరాన్ మిస్సైళ్ళను సౌది అడ్డుకుంది. దీని వెనుక సున్ని – షియా వివాదం ఉందని విశ్లేషణ జరుగుతోంది.

ఇరాన్ పై అమెరికా ఆంక్షలు విధించినపుడు సహచర ముస్లిం దేశాలు అంతగా స్పందించలేదు. దీంతో గుర్రుగా ఉన్న ఇరాన్ ప్రణాళిక ప్రకారం హమాస్, హిజ్బోల్లాకు సహకరించి పాలస్తీనా అంశంలో జోక్యం చేసుకునే దిశగా సాగింది. తద్వారా ముస్లిం దేశాలకు పశ్చిమ దేశాలు శత్రువులని చిత్రీకరించే కుతంత్రం సాగుతోంది. ఇరాన్ ఎత్తుగడ గ్రహించిన సున్ని దేశాలు ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తున్నాయి.

రాబోయే రోజుల్లో రెండు వర్గాల మధ్య ప్రత్యక్ష యుద్ధం సంభవించే అవకాశం లేకపోలేదని పాశ్చాత్య దేశాల్లో విశ్లేషణ జరుగుతోంది. అందుకు అమెరికా, నాటో దేశాలు ఆజ్యం పోసే ప్రమాదం కూడా ఉంది. రెండు వర్గాల మధ్య అల్లర్లు రాజేస్తేనే ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నియంత్రించగలమని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ముస్లిం సమాజంలో ఇప్పటికే ఏకాకి అయిన ఇరాన్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాల్లో ఎగదోసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ స్థాయిలో నిఘా వర్గాలు గ్రహించాయి.

యూరోప్ దేశాలు ఒకప్పుడు ఇస్లామిక్ దేశాల్లో అల్లర్లు జరిగితే సామాన్యులను శరణార్ధులుగా ఆశ్రయం ఇచ్చేవి. ఆయా దేశాల్లో ఈ మధ్య ముస్లింలు చేస్తున్న అల్లర్లు ప్రభుత్వాలను కలవరపరుతున్నాయి. ఇందుకు ఫ్రాన్స్, జర్మనీలలో జరిగిన ఘటనలే ఉదాహరణ. పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న ఘటనలతో సామాన్య ముస్లిం ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు.

గల్ఫ్ దేశాల కూటమి, ఇస్లామిక్ దేశాల కూటమి (Organisation of Islamic Cooperation- OIC) చొరవ తీసుకోకపోతే ముస్లిం దేశాల మధ్యనే విభేదాలు పెచ్చరిల్లే ముప్పు పొంచి ఉంది. ఐసిస్ విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఫోబియా పెరుగుతోంది.

పశ్చిమాసియాలో సంక్షోభానికి తొందరగా తెరపడక పోతే జాతులు, మతం పేరుతో చెలరేగే చిచ్చు మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమించవచ్చు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్