Tuesday, September 17, 2024
HomeTrending NewsWest Asia: రాచపుండులా పశ్చిమాసియా సంక్షోభం

West Asia: రాచపుండులా పశ్చిమాసియా సంక్షోభం

పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ మానవాళికి చుట్టుకునేలా ఉంది. అంతర్జాతీయంగా అమెరికా, యూరోప్ అగ్ర దేశాలు ఇజ్రాయల్ వెన్నంటి ఉండగా…ముస్లిం దేశాల్లో అధిక భాగం పాలస్తీనాకు మద్దతుగా నిలిచాయి. ఉక్రెయిన్ తో యుద్దంలో మునిగి ఉన్న రష్యా…సమయానుకూలంగా గల్ఫ్ దేశాలకు ముఖ్యంగా ఇరాన్ విధానాలకు మద్దతు ఇస్తుంది. స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతున్న చైనా…ఎక్కడ అడుగుపెట్టినా ఆ దేశాన్ని నిలువు దోపిడీ చేయటమే పనిగా విదేశాంగ విధానం అవలంభిస్తోంది.  పశ్చిమాసియా యుద్దాన్ని అదే కోవలో చూస్తోంది.

ఇజ్రాయల్ – పాలస్తీనా సమస్య ఈనాటిది కాదు. క్రైస్తవులు, ముస్లింలకు పుణ్య స్థలమైన జెరూసలేం మీద ఆధిపత్యం కోసం 11వ శతాబ్దం నుంచి రెండు మతాల మధ్య క్రూసేడు యుద్దాలు జరిగాయి. ఆనాడు పరిష్కారం కాని సమస్య కొనసాగింపే ఈనాటి పశ్చిమాసియ సంక్షోభం.

మనుగడ కోసం పోరాటం(struggle for existence) అన్న సిద్ధాంతం ప్రాతిపదికగానే యూదు దేశ ఆవిర్భావం, పొరుగు దేశాలతో నిత్య అప్రమత్తత, స్వీయ రక్షణ తదితర సూత్రాల ఆధారంగా ఇజ్రాయల్ ఉనికి కొనసాగుతోంది. అమెరికా, నాటో దేశాల  ప్రయోజనాల కోసం… ముస్లిం సమాజానికి యూదు దేశాన్ని బూచిగా చూపిస్తున్నాయి. ఆ దేశాలే ఒకప్పుడు యూదులను ఈసడించుకొని గ్యాస్ చాంబర్లలో వేసిన దుర్మార్గాలను, యూదులకు ఓ దేశం ఉండాలనే సమయంలో అక్కడి సమస్యలు అపరిష్కృతంగా వదిలేసిన ఇంగ్లాండ్ ద్వంద్వ నీతిని చరిత్ర మరువదు.

ఇటీవల జరిగిన ఘటనలను విశ్లేషిస్తే…విస్తు గొలిపే అంశాలు బయట పడతాయి. మొదట హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయల్ మీద దాడి చేసినపుడు ప్రపంచదేశాల్లో మెజారిటీగా ఖండించాయి. అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల ఉనికి లేకుండా చేయాలని ప్రగల్భాలు పలికాయి. అయ్యో భూమ్మీద యూదులను బతుకనివ్వరా అని అమెరికా నుంచి భారత్ దాక అన్ని దేశాల ప్రజలు హాహాకారాలు చేశారు.

తీరా ఇజ్రాయల్ సైన్యం రంగంలోకి దిగగానే కొన్ని దేశాల సన్నాయి నొక్కులు మొదలయ్యాయి. ఉగ్రవాదుల పేరుతో అమాయకులను చంపుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రజలనే కవచంగా చేసుకున్న హమాస్ టెర్రరిస్టులు ఆస్పత్రులు, శరణార్థి శిభిరాల్లో నక్కి ఉన్నారని ఇజ్రాయల్ ఆరోపిస్తోంది. ఉత్తర గాజాలో కొద్ది రోజులుగా అణువణువు గాలిస్తున్న ఇజ్రాయల్ డిఫెన్సు  ఫోర్సు (ఐడిఎఫ్) సైన్యం.. హమాస్ ముష్కరులను మట్టుపెడుతోంది.  అయితే పరస్పర దాడుల్లో చిన్నారులు సమిధలు కావటం  బాధాకరమైన అంశం.

ఇక్కడ చర్చించాల్సిన అంశం ఒకటుంది. ప్రజా పోరాటాల నుంచి హమాస్ ఫక్తు ఉగ్రవాద సంస్థగా మారింది. హమాస్ ను మొదటి నుంచి ఇరాన్ పెంచి పోషిస్తోంది. వీరికి లెబనాన్ కు చెందిన మతోన్మాద హిజ్బోల్లా ఉగ్రవాదులు తోడయ్యారు. ముస్లిం సమాజంలోని కొంత మంది సంపన్నులు, దేశాలు వీరికి ఆర్థిక సాయం చేస్తున్నాయి. కంట్లో నలుసులా మారిన వీరందరినీ దశాబ్దాలుగా యూదు దేశం ఎదుర్కుంటోంది.

మన దేశం విషయానికి వస్తే… హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయల్ మీద దాడి చేసి, అమాయకుల ఉచకోతకు పాల్పడటం, వందలమందిని అపహరిస్తే మాట్లాడని రాజకీయ పార్టీలు, సంస్థలు, నేతలు ఇప్పుడు పాలస్తినాలో మారణహోమం జరుగుతోందని విమర్శలు చేస్తున్నారు. ప్రపంచ దేశాల వైఖరి కూడా ఈ విధంగానే ఉంది. ఇప్పటికీ హమాస్ రాకెట్లు ఇజ్రాయల్ మీద విరుచుకుపడుతున్నాయి. పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనలు చేస్తున్న వారు యూదులను విస్మరిస్తున్నారు.

గాజాలో హమాస్ మూకలను వేటాడుతున్న ఇజ్రాయల్ అక్కడే తిష్టవేస్తుందని…దాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితిలో జోర్డాన్ తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానానికి అనుకూలంగా భారత్ సహా 145 దేశాలు ఓటు వేశాయి. అమెరికా, కెనడా తదితర ఏడు దేశాలు వ్యతిరేకించగా 18 దేశాలు తటస్థంగా ఉన్నాయి. ఈ హెచ్చరికలను ఇజ్రాయల్ ఖాతరు చేస్తుందా అంటే సందహమనే చెప్పాలి.

ఇటీవల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్సు సమావేశంలో ముస్లిం దేశాల మధ్యనే విభేదాలు వచ్చాయి. ఇజ్రాయల్ సైన్యాన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇరాన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సహచర దేశాలు వ్యతిరేకించాయి. వాటిలో ముస్లిం సమాజానికి పెద్దన్నగా భావించే సౌది అరేబియా, యుఏఈ, జోర్డాన్, ఈజిప్టు, బహ్రెయిన్, సూడాన్, మొరాకో, మారిటోనియా, జిబౌటి దేశాలు ఉన్నాయి.

మతం కోణంలో పాలస్తీనా ముస్లింలకు సానుభూతి తెలిపే ఇరాన్, పాకిస్థాన్,టర్కీ తదితర దేశాలు వుయ్ఘుర్ ముస్లింలను చైనా చిత్రహింసలు పెడుతుంటే నోరుపెగలదు. గాజా నుంచి సాటి ముస్లింలకు ఆశ్రయం ఇచ్చేందుకు ఈజిప్టు నిరాకరిస్తోంది. దీన్ని ఎవరు ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాల క్రితం ఆపత్కాలంలో వచ్చిన అఫ్ఘన్ శరణార్ధులను ఉన్నపళంగా దేశం విడిచి వెళ్ళాలని పాక్ ప్రభుత్వం హుకుం జారీ చేస్తే మానవతా వాదులకు, దేశాలకు పట్టదు.

కేవలం ఇజ్రాయల్ – పాలస్తీనా వ్యవహారంలో తలదూర్చటానికి ఎవరి అవసరాలు వారికి ఉన్నాయి. మతం కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో చొరవ తీసుకుంటే పరిష్కారం చేయలేని సమస్య కాదు. విశ్వానికి చీడ పీడలా తయారైన పశ్చిమ దేశాలు…వాటి స్వార్థ పూరిత విధానాలతో పశ్చిమాసియ సంక్షోభం మధ్యదార తీరంలో రాచపుండులా ఉండనుంది.

-దేశవేని భాస్కర్

Also Read: West Asia: ప్రపంచ సమస్యగా పశ్చిమాసియా సంక్షోభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్