Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపాట్నా టూర్ పట్టెంత!

పాట్నా టూర్ పట్టెంత!

Sir-Tour: కలిసి వుంటే కలదు సుఖం… ఐకమత్యమే బలం ఇవన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విపక్షాలకు తిరిగి గుర్తుకొస్తున్నాయి. దేశవ్యాప్తంగా బలంగా వున్న పెద్ద పులి బిజేపి ని ఎదుర్కోవాలంటే అందరం మళ్లీ కలవాలి అంటూ బీజేపీయేతర పక్షాల ఐక్యతా రాగం ఇప్పుడు మళ్లీ  షురూ అవుతోంది.

బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేస్తూ ‘సంధి లేదు సమరమే’ అంటూ తాడోపేడో అంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బీహార్ యాత్ర ఇప్పుడు మళ్లీ వార్తలకెక్కి ‘బీజేపీ ముక్త్ భారత్’ దిశగా విపక్షాలు అడుగేయాలన్న పిలుపు మరోమారు వినిపించింది. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కృతనిశ్చయంతో అడుగు ముందుకు వేసిన కేసిఆర్ బీహార్ లోని అమర జవాన్లకు, హైదరాబాద్లో ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన బీహారీ కార్మికులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం పేరుతో పాట్నా పర్యటన చేపట్టి శంఖం పూరించారు. కేసీఆర్ ముఖ్య ఉద్దేశ్యం జాతీయ రాజకీయాలే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకు ముందు రెండు మూడు పర్యాయాలు విపక్షాల ఐక్యత పేరుతో కేసిఆర్ పర్యటనలు సాగినా, అవి అంత ఫలితం ఇవ్వలేదు.మరి పాట్నా పర్యటన ఆ కోవలోకేనా, పట్టుదొరుకుతుందా? అనుమానాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.

జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రస్తుతం విపక్షాలకు ఆశాదీపంలా కనిపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ ఎన్డీయే కూటమి లో వుండి, సమయం చూసి బీజేపీ కే ఝలక్ ఇచ్చిన నితీష్ , ఆర్జేడీ తో కలిసి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడమే కాదు, ఇటీవల కాలంలో కమలనాథులు విపక్ష ప్రభుత్వాలను పతనం చేస్తోన్న రాజకీయాలకు ఓ పధ్ధతి ప్రకారం  బ్రేక్ వేసి, రివర్స్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. అందుకే కేంద్రం పై పోరులో ఆ సీనియర్ నేత సలహాలు, సహకారం కేసీఆర్ కోరుకోవడంలో తప్పులేదు.  బీహార్ ముఖ్యమంత్రి గా వున్నా జాతీయ రాజకీయాల్లో నితీష్ కుమార్ కు మంచి గుర్తింపు ఉంది.  అవసరమైతే విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా నిలబడగల సత్తా వున్న నేత కూడా. అలాంటి నితీష్ కుమార్ ను కలుపుకుని, కలిసొచ్చే వారిని కౌగిలించుకుంటూ పోతేనే కాలం కలిసొస్తుందన్నది … ఉద్యమ నేతగా ఎదిగిన కేసీఆర్ కు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ వ్యూహాలు, ఆలోచనలు ఎవరికి అంత త్వరగా అంతుచిక్కవు కూడా.

తెలంగాణ లో ప్రస్తుతం వున్న రాజకీయ పరిస్థితులు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిద్ర పట్టనీయడం లేదు.  ఎలాగోలా తెలంగాణ లో పాగా వేయాలని బిజెపి తహ తహ లాడుతోంది. బలుపో, వాపో ఆ పార్టీవారికే స్పష్టంగా తెలియకున్నా తెలంగాణ లో అధికారంలోకి వచ్చినట్లు కలలు మాత్రం కంటున్నారు. ఢిల్లీ పెద్దలు కూడా దక్షిణాదిలో తమకు ఎంతోకొంత అనుకూలంగా వున్న రాష్ట్రం కావడంతో తెలంగాణపై బాగానే దృష్టి పెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కంటి నిండా కునుకు లేకుండా చేస్తున్నారు.

తెలంగాణ బ్రాండ్ పాలిటిక్స్
కేసీఆర్ ప్రధాని మోదీనే నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ‘మీరు గోకకున్నా నేనే గోకుతా’ నంటూ సమరానికి సై అన్న కేసీఆర్ బీజేపీ గుజరాత్ మోడల్ రాజకీయానికి చెక్ చెప్పేలా తెలంగాణ మోడల్ ను తెరమీదకు తెస్తున్నారు.  2014 ఎన్నికల్లో గుజరాత్ మోడల్ ను ప్రొజెక్టు చేసి బీజేపీ మోదీ నుంచి ప్రధాని అభ్యర్ధిగా నిలిపి విజయం సాధించిన రీతిలో ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి ని చూపెట్టి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలను హైదరాబాద్ పిలిపించి ఆతిధ్యం ఇచ్చి మరీ తెలంగాణ ప్రభుత్వ విధానాలను విడమర్చి చెప్పారు. వ్యవసాయ అభివృద్ధి, రైతు భరోసా, రైతుబీమా , సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరధ వంటి పథకాలను ఏకరువు పెట్టారు. బీజేపీ రాష్ట్రాల తీరును ఎండగడుతూ కేసిఆర్ ప్రచారం సాగుతోంది.

దేశ రాజకీయాల్లో నితీష్ కుమార్ ది ఓ వినూత్న శైలి. అయన ఎప్పుడు, ఏ విషయంలో అలుగుతారో ఎవరికీ  అంతు చిక్కదు.  ఎప్పటికయ్యది… అన్నట్లు కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంటారు.  జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా కేసిఆర్ ట్ ఏర్పాటు చేయ తలపెట్టిన ఫ్రంట్ కు ఏ స్థాయి వరకూ వెన్నుదన్నుగా నిలుస్తారనేది ఓ అంతు చిక్కని ప్రశ్న.

ఏదేమైనా కేసీఆర్ పాట్నా పర్యటన మరోసారి విపక్షాల ఐక్యత అవసరాన్ని గుర్తు చేసింది. ముందుగా అందరం బీజేపీకి వ్యతిరేకంగా కలిసి నడుద్దాం.. ఆ తరువాత నాయకుడిని ఎన్నుకుందాం అంటూ బీజేపీ ముక్త్ భారత్ కు పిలుపు నిచ్చారు కేసీఆర్, అందుకు స్వరం కలిపారు నితీష్ కుమార్. ఈ ప్రయత్నం ముందుకు సాగుతుందా… ఈ సమావేశానికే పరిమితం అవుతుందా అన్న అనుమానాలు వెంటాడుతూనే వున్నాయి. ఇటు కేసీఆర్ పాట్నా పర్యటన నేపధ్యం లోనే అటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా విపక్షాలు ఐక్యతకు పిలుపు నిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్షాల కూనిరాగాలు కాంగ్రెస్ తో కలిసి చేస్తాయా.. ఎవరి కుంపటి వారిదేనా అన్నది తేలాల్సి వుంది. ఏదైనా మోదీ – షా ద్వయం వేసే పాచికలు తట్టుకొని విపక్షాలు ఎంత మేరకు నిలుస్తాయో వేచిచూడాలి.

– వెలది కృష్టకుమార్

Also Read :

అజాద్ జ్ఞానం

Also Read :

పాదుకయినా కాకపోతిని!

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్