పాకిస్థాన్‌లో ఐసిస్ మరింత బలపడుతోంది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో మతోన్మాదులను చెరదీస్తూ…ప్రజలను దారిలోకి తెచ్చే ప్రణాలికలు రచిస్తోంది. పాక్ సమాజంలో అలజడి సృష్టిస్తోంది. ఈ కోవలో ఖైబర్ ఫఖ్తున్‌క్వా ప్రావిన్స్‌లో ఓ పార్టీ బహిరంగ సభలో భారీ పేలుడు సంభవించి 54 మంది దుర్మరణం చెందారు. అది పేలుడు కాదని.. తామే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డామని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. అఫ్గానిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ ఫఖ్తున్‌క్వా ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లాలో ఇస్లామిక్ పార్టీ అయిన జమైత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఫజల్ ఆదివారం బహిరంగ సభనిర్వహించింది. సభ జరుగుతుండగా సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో 23 మంది చిన్నారులు సహా 54 మంది మరణించారు. సుమారు 200 మంది గాయపడ్డారు.
ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడు తన జాకెట్‌లో ఉన్న డిటోనేటర్‌ను బహిరంగ సభలో పేల్చివేశాడని ఐఎస్‌ఐఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఆత్మాహుతి దాడిలో భారీ సంఖ్యలో ప్రజలు గాయపడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.