సోమాలియాలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైన్యం దాడిలో ఐసీస్ సీనియర్ నాయకుడు బిలాల్ అల్ సుదానీ హతమయ్యాడు. ఉత్తర సోమాలియాలోని పర్వత గుహ కాంప్లెక్సులో ఉన్న ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్రూప్ ప్రాంతీయ నాయకుడైన సుదానీని పట్టుకునేందుకు అమెరికన్ పారామిలిటరీ దళాలు యత్నించాయి. ఈ క్రమంలో సైన్యం జరిపిన కాల్పుల్లో సుదానీతోపాటు అతని సహచరులు మరో 10 మంది మంది హతమయ్యారని యూఎస్ సైనికాధికారులు ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో తమ సైనికులెవరూ గాయపడలేదని వెల్లడించారు.
అమెరికా దాడుల్లో సోమాలియా ఇసిస్ నేత హతం
ఈ నెల 22న సోమాలియాలోని గాల్కాడ్ టౌన్ సమీపంలో అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఇస్లామిస్ట్ అల్ శబాబ్‌కు చెందిన 30 మంది తీవ్రవాదులు చనిపోయారు. అమెరికా రక్షణ విభాగమైన పెంటగాన్ విజ్ఞప్తి మేరకు సోమాలియా మిలిటరీకి యూఎస్ సహాయం అందిస్తున్నది. 2022, మే నుంచి దాదాపు 500 ట్రూపులను సోమాలియాలో మోహరించింది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సోమాలియా సైనికులకు తగిన శిక్షణ అందించడంతోపాటు వారికి సపోర్ట్‌గా టెర్రరిస్టు కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నది.