ఆఫ్రికా దేశం ఉగాండాలో దారుణం చోటు చేసుకుంది. అలైడ్ డెమొక్రటిక్ ఫోర్స్ (ఏడీఎఫ్)కు చెందిన ఇస్లామిక్ సాయుధ తిరుగుబాటుదారులు.. పశ్చిమ ఉగాండాలో మారణహోమం సృష్టించారు. కాంగో సరిహద్దు సమీపంలోని ఎంపాండ్వే పట్టణంలోని ఓ పాఠశాలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 25 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
తూర్పు ఉగాండాలో 1990వ దశకంలో ఏడీఎఫ్ పుట్టుకొచ్చింది. 1986 నుంచి అక్కడ అధికారంలో ఉన్న ఉగాండా అధ్యక్షుడు యోవెరీ ముసెవెని పాలనను ఏడీఎఫ్ వ్యతిరేకిస్తోంది. 2001లో ఉగాండా సైన్యం చేతిలో ఓటమి తర్వాత.. డీఆర్సీలోని నార్త్ కివు రాష్ట్రంలో రీలొకేట్ అయ్యింది. అక్కడి నుంచి గత రెండు దశాబ్దాలుగా ఏడీఎఫ్ సభ్యులు కార్యకలాపాలు సాగిస్తున్నారు.
వీరికి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తోనూ సంబంధాలు ఉన్నాయి. 2021లో ఉగాండా రాజధాని కంపాలాలో జరిగిన భీకర బాంబు దాడి ఈ ఏడీఎఫ్ పనేనని ఆరోపణలు ఉన్నాయి.