మలేషియా కొత్త ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సాబ్రి యాకోబ్ ఈ రోజు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు విశ్వాసం కోల్పోవటంతో మొహియోద్దిన్ యాసిన్ రాజీనామా చేయగా తొమ్మిదవ ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సాబ్రి బాధ్యతలు చేపట్టారు. యునైటెడ్ మలెస్ నేషనల్ ఆర్గనైజేషన్(UMNO) సుదీర్ఘంగా మలేషియాలో అధికార పార్టీగా ఉంది. మలేషియా రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సాబ్రి యాకోబ్ నియమకానికి ఆమోదం తెలిపినట్టు రాజభవనం వర్గాలు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశాయి.
UMNOకు చెందిన ఇస్మాయిల్ సాబ్రి ప్రధానమంత్రి పదవి చేపట్టినా అది తాత్కాలికమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో UMNO ఓటమి పాలైంది. భారీ ఆర్థిక కుంభకోణం జరగటం, అవీనీతి ఆరోపణలతో ఓటమి చవిచూసింది. మలేసియన్ యునైటెడ్ ఇండైజేనుస్ పార్టీ కి చెందిన మొహియోద్దిన్ యాసిన్ పాలనలో సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు తారాస్థాయికి చేరుకున్నాయి. మిత్ర పక్షాల్ని ఏకతాటి మీదకు తీసుకు రావటం యాసిన్ కు తలకు మించిన భారంగా మారింది. కరోనా కట్టడిలో విఫలమయ్యారని, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేక పోయారని యాసిన్ మీద ప్రజల్లో అసంతృప్తి ముదిరింది.
మలేషియా లో ఉన్న అనేక పార్టీల్లో ఏ పార్టీ ఇంతవరకు 20 శాతం కన్నా ఎక్కువగా సీట్లు సంపాదించలేదు. అధికారం కోసం చట్టసభ సభ్యులు పార్టీలు మారటం మలేషియాలో షరామాములే. జాతి, మత ప్రతిపాదికన అధిక ప్రభావం చూపే మలేషియా ఎన్నికల్లో పార్టీల నుంచి నేతల కప్పదాట్లు దేశ రాజకీయాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో నిలకడలేని ప్రభుత్వాలతో పాలన సాగుతోంది.