Isro Pslv C52 Success :
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన PSLV C52 ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని ఒకటో ప్రయోగ కేంద్రం నుంచి 25.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం సరిగ్గా ఉ.5.59 గం.కు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 18.31 నిమిషాల పాటు ప్రయాణించిన రాకెట్.. 1710 కిలోల బరువున్న IRSAT-1 తోపాటు మరో రెండు ఉపగ్రహాలను నిర్ణిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాలు 10 ఏళ్ల పాటు వ్యవసాయం, అటవీ, నీటివనరుల నిర్వహణ, వరదలపై విలువైన సమాచారం అందించనున్నాయి.
ప్రయోగ కేంద్రం నుంచి బయలు దేరిన 18.31 నిమిషాల తర్వాత ఈ మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెట్టినట్టు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రకటించారు. శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ ఏడాదిలో ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగం ఇదే కాగా… ఇస్రో అధిపతిగా ఇటీవల నియామకమైన డాక్టర్ సోమనాథ్ ఆధ్వర్యంలో చేపట్టిన తొలి ప్రయోగం కావడం విశేషం. షార్ నుంచి ప్రయోగించిన 80వ మిషన్ కాగా ఇస్రో రేసుగుర్రం పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక విజయవంతంగా 54వసారి నింగిలోకి దూసుకెళ్లింది.