అంతరిక్ష ప్రయోగాలలో భారత కీర్తి పతాక ఎగురవేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయి అధిగమించింది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. నేడు ప్రయోగించిన ఎన్వీఎస్-01 ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. మన దేశ రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో మొదటిదైన ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. తాజా ప్రయోగంతో భారత భూభాగం చుట్టూ 1500 కిలోమీటర్ల పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. కాగా, జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు కాగా, ఎన్వీఎస్-01 ఉపగ్రహం బరువు 2,232 కిలోలు. ఉపగ్రహం జీవిత కాలం 12 సంవత్సరాలు.
ISRO: ఎన్వీఎస్-01 ఉపగ్రహం విజయవంతం
ఆదివారం ఉదయం 7:12 గంటలకు జీఎస్ఎల్వీ- ఎఫ్ 12 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది.
షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. 27:30 గంటలు కొనసాగిన కౌంట్ డౌన్ తర్వాత రాకెట్ నింగికెగిరింది. దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగిన ప్రయాణం తర్వాత ఎన్వీఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది. భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.