అనంతమైన వేదాలను నాలుగుగా పరిష్కరించి; అష్టాదశ పురాణాలు రచించినా వ్యాసుడికి ఇంకా ఏదో వెలితి మిగిలిపోతే…ఆ వెలితి ఏమిటో చెప్పినవాడు నారదుడు. వాల్మీకికి రాముడి కథ చెప్పి రాయమన్నది కూడా నారదుడే. భగవంతుడి కథలను తనివితీరా భాగవతంగా రాయి…ఆ వెలితి తీరిపోతుందని సలహా ఇచ్చాడు నవవిధ భక్తులను సూత్రీకరించిన నారదుడు. అప్పుడు భాగవతం రాశాడు వ్యాసుడు.
వ్యాసుడి భాగవతంలో కృష్ణ కథలు అద్భుతంగా ఉంటాయి. ఆ వ్యాసుడు దర్శించిన కృష్ణుడిని తెలుగువారి ఇళ్లల్లో పిల్లాడిని చేశాడు తెలుగు భాగవతంలో మన బమ్మెర పోతన. సాధారణంగా సంస్కృత శ్లోకాల్లో, స్తోత్రాల్లో బీజాక్షరాలుంటాయి. వాటిని పలికే పద్ధతిలో పలికితే శక్తులుంటాయి. పోతన తెలుగు పద్యాల్లో సంస్కృత మంత్రశక్తులను మించి మహత్వ, కవిత్వ, పటుత్వ శక్తులను నింపాడు. కొన్ని చోట్ల సంస్కృత భాగవతానికి మించిన శబ్ద సౌందర్యం, అర్థ గాంభీర్యం, రస సిద్ధి పోతన సాధించడం తెలుగువారి అదృష్టం. పదహారణాల తెలుగు పద్యానికి, తెలుగుతనానికి, తెలుగు ధనానికి పోతన పెట్టింది పేరు.

“ఓ యమ్మ ! నీ కుమారుడు మాయిండ్లలొ పాలు పెరుగు మననీడమ్మా !
పోయెద మెక్కడికైనను మా యన్నల సురభులాన మంజుల వాణీ!”
అని గోపికలు మన తెలుగులోనే యశోదమ్మకు ఫిర్యాదు చేస్తారు.
“నల్లనివాడు, పద్మనయనమ్ముల వాడు…నెమలిపింఛమువాడు…మీ పొదలమాటున లేడుకదమ్మ చెప్పరే!” అని గోపికలు మల్లె పొదలను మన తెలుగులోనే అడిగారు.
“లావొక్కింతయు లేదు…నీవు తప్ప వేరే దిక్కులేదు”
అని మొసలి నోటబడ్డ గజేంద్రుడు మన తెలుగులోనే ప్రార్థించాడు.
పోతన తెలుగు మందార మకరంద మాధుర్యాలను శ్రీకృష్ణుడు జుర్రుకున్నాడు.
“అల వైకుంఠాపురంబు లోపల…ఆ మూల సౌధంబులో…” ఉన్న శ్రీకృష్ణుడిని పోతన తెలుగువారికి పట్టించాడు.
తన జన్మ చరితార్థం కావడానికి భాగవతాన్ని తెలుగులోకి అనువదిస్తున్నానని పోతన కావ్యారంభంలో అత్యంత వినయంగా చెప్పుకున్నాడు. తెలుగు భాషను, తెలుగువారిని కూడా చరితార్థులను చేశాడు. పోతన పద్యం పాడడం, వినడం, చదవడం, కనీసం తెలియడం తెలుగువారికి ఒక గుర్తింపు.

“అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్”
భాగవత ప్రారంభంలో దేవతాస్తుతిలో పోతన పద్యమిది. వేనవేల తెలుగు పద్యాల్లో ఆణిముత్యం లాంటి పద్యమిది. దుర్గా దేవి మెడలో అక్షరహారమయిన పద్యమిది. లోకంలో అమ్మలను కన్న అమ్మలందరికీ అక్షర హారతి పట్టిన పద్యమిది. పరాశక్తి రూపాన్ని పదహారణాల తెలుగు మాటల్లో బంధించిన పద్యమిది. తెలుగు మాటలను మంత్రమయం చేసి బీజాక్షరాలుగా మలచిన పద్యమిది. మహత్వ కవిత్వ పటుత్వ సంపద మనకు ఇచ్చిన పోతన మాత్రమే రాయగలిగిన పద్యమిది.
అర్థం:-
లక్ష్మి, పార్వతి, సరస్వతి- ముగ్గురు అమ్మలు. ఈ ముగ్గురు అమ్మలను కన్నది ఆది పరాశక్తి దుర్గ. దేవతల తల్లి అదితి. రాక్షసుల తల్లి దితి. ఆ దితికి కడుపుకోత కలిగించిన తల్లి. అంటే రాక్షసులను సర్వనాశనం చేసిన తల్లి. తనను నమ్మే దేవతల మనసులో కొలువై ఉండే తల్లి. అలాంటి తల్లి నాకు గొప్ప పటుత్వం ఉన్న కవిత్వం ప్రసాదించుగాక. ఇది పైకి ధ్వనించే అర్థం. ఇంతకు మించి ఇందులో ఇంకా లోతయిన అర్థం ఉంది. పద్యం మొదట ఉన్న అమ్మలగన్న అమ్మ… ముగ్గురమ్మలను మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలను క్రమాలంకారంలో అన్వయించుకుంటే-
మహత్వం – ఓం,
కవిత్వం- ఐం,
పటుత్వం- హ్రీమ్,
సంపద- శ్రీమ్
అవుతుంది. బీజాక్షరాలను ఎలాపడితే అలా, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు కాబట్టి- వాటి సంకేతాలను పోతన ఈ రూపంలో ఆవిష్కరించాడు. “చాల పెద్ద” అద్భుతమయిన ప్రయోగం. సంస్కృతంలో “మహా శక్తి” అన్న మాటకు తెలుగు అనువాదం.

“శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోనిధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁగానఁగ నెన్నడు గల్గు భారతీ!”
ఇది కూడా భాగవత ప్రారంభంలో పోతన చేసిన దేవతా స్తుతి పద్యం. తెలుపు స్వచ్ఛతకు, జ్ఞానానికి ప్రతీక. శరత్కాల తెల్లని మేఘాలు,
తెల్లని చల్లని చంద్రుడు,
పరిమళాలు వెదజల్లే తెల్లని పచ్చ కర్పూరం,
తెల్ల చందనం,
తెల్లటి హంస,
తెల్లని మల్లెల హారం,
తెల్లని మంచు,
తెల్లని నురగ,
తెల్లని వెండి కొండ,
తెల్ల రెల్లుగడ్డి,
తెల్లని ఆదిశేషుడు,
తెల్లని కొండమల్లె,
తెల్ల మందారం,
తెల్లని గంగ…
పోతన తలపుల్లో సరస్వతి తట్టగానే ఇన్ని తెలుపులు ఉపమాలంకారాలుగా ఆయన ఘంటం ముందు పోటీలు పడ్డాయి. ఇన్ని తెలుపుల అందాలను మించి వెలిగే సరస్వతిని మదిలో ఎప్పటికి చూస్తానో అన్నాడు పోతన. అంటే ఆయన చూడలేదని కాదు. మనం అలాంటి సరస్వతిని చూడాలంటే ఇలా అడగాలి. ఇలా ఊహించాలి. ఇలా ప్రసన్నం చేసుకోవాలి.
పోతన ఎక్కడ భాగవతాన్ని రాజులకు అంకితం ఇస్తాడో అని సాక్షాత్తు సరస్వతీ దేవి బాధపడి..ఆయన ముందు కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటే-
“కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల ఏడ్చెదో!
కైటభదైత్యమర్దనుని గాదిలికోడల ఓ మదంబ ఓ
హాటకగర్భురాణి నినునాకటికై గొనిపోయి యల్ల క
ర్ణాటకిరాటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ, నమ్ము భారతీ!”
అని పోతన హామీ ఇచ్చాడంటారు.
(కాటుక కంటినీరు…పద్యం పోతనది కాకపోవచ్చు అని పండితులమధ్య చాలా కాలం చర్చ జరిగింది. అది ఇక్కడ అనవసరం)

లక్ష్మి, పార్వతి, సరస్వతి- ముగ్గురిలో మూలమై ఉన్న దుర్గమ్మను తెలుగు సాహిత్యంలో బహుశా పోతన ఆవిష్కరించినంత అందంగా ఇంకెవరూ ఆవిష్కరించలేదు. శారదనీరదేందు…పద్యం అర్థం తెలియకపోయినా చదివినప్పుడు, పాడినప్పుడు, విన్నప్పుడు సాక్షాత్తు సరస్వతి దిగివచ్చి ఆశీర్వదించి వెళ్లాల్సిన పద్యం. తెలుగు పద్యం జిగి బిగి తెలిపే పద్యం. తెలుగు అందచందాలను పద్యాల్లో పోతపోసి…తెలుగు కవిత్వ పటుత్వ మహత్వ సంపదను నిర్వచించిన పద్యం.
అలాంటి పోతనామాత్యుడు పుట్టిన జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలో ఇప్పుడు సరస్వతీదేవి నిజంగానే కాటుక కంటినీరు బుగ్గలపై ధారగా పడేలా వెక్కి వెక్కి ఏడుస్తోంది. అక్కడ పోతన స్మృతివనం, మ్యూజియం, కల్యాణ మండపం నిర్మించడానికి గత ప్రభుత్వం 14 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణాలు మొదలయ్యాయి. కొంత పనులు జరిగాయి. ప్రభుత్వం మారింది. బమ్మెరలో పోతన ప్రాజెక్టు ఆగిపోయింది. ప్రస్తుతం ముళ్ళపొదల్లో బమ్మెర పోతన చిక్కుకుని ఉన్నాడు. అంతటి పోతనకు ఇంతటి దుర్గతి ఏమిటని సరస్వతి విలపిస్తోంది. సరస్వతి బాధను చూడలేక పోతన గుండెలు బాదుకుంటున్నాడు. ఆ దారినే వెళుతూ ఉన్న మన తెలుగు పుట్టు గుడ్డి కళ్ళకు ఇది కనిపించదు. మన పుట్టు చెవిటి చెవులకు ఇది వినిపించదు.

అయినా…బమ్మెరలో మందిరాలు కట్టి పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించాలని అనుకుంటున్నారు కానీ…తెలుగు పలక చేతబట్టి…తెలుగు బలపం వేలున పట్టి…తెలుగు పిల్లలు ఓం ప్రథమంగా దిద్దేది ఇంగ్లిష్ అక్షరాలే కదా! ఆ ఏ ఫార్ యాపిళ్ళు, సి ఫార్ క్యాట్లు చూసి పోతన, శారద తట్టుకోలేరు. అందుకే ఈ మందిరం ఆగిపోయి ఉందేమో! ఏమో!!
పోతే పోతాడు పోతన…మనకెందుకు?
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

