ఎవరు ఎప్పుడు దారి తప్పారో కానీ…”దేవదాయ, ధర్మదాయ” శాఖ పేరును “దేవాదాయ, ధర్మాదాయ” అని దశాబ్దాలుగా తప్పుగా రాస్తున్నారు. ఆ తప్పే ప్రభుత్వ గెజిట్లోకి కూడా ఎక్కేసరికి దాన్నే ఒప్పుగా లోకం అనుకుని…తప్పుదారిలోనే వెళుతోంది. మనసా వాచా కర్మణా మన తప్పులను దిద్దుకోవడం, మళ్ళీ ఆ తప్పులు చేయకపోవడం భక్తి మార్గంలో మౌలిక సూత్రాలు.
దేవుడినే తప్పుదారిలోకి తీసుకెళ్లాలని ప్రయత్నించే మన ఆధునిక భక్తి వ్యాపార విధానాల్లో ఆదాయమే ప్రధానం కాబట్టి…”దేవాదాయ” మాటే సముచితమేమో!
కానీ…నూటికో కోటికో భాష తెలిసినవారు, మాటకు భావార్థాలు తెలిసినవారు ఉంటారు. అలా జగ్గయ్యపేట సమీపంలో కృష్ణానది తీరంలో శతాబ్దాల చరిత్ర కలిగిన ముక్త్యాల కోటి లింగ హరిహర పుణ్యక్షేత్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డుల్లో “దేవదాయ, ధర్మదాయ శాఖ” అని తప్పులేకుండా చక్కగా రాశారు. ఇన్నేళ్ళలో దేవుడి ఆదాయం మీది నుండి దేవుడి దయ(దేవదాయం- దేవుడి భాగం) మీదికి దృష్టి మళ్లించిన బోర్డును తొలిసారి చూసి పరవశించిపోయాను. ఈ బోర్డు రాయించినవారికి ఆ ముక్తేశ్వరుడు సకల శుభాలను ఇచ్చుగాక!

ముక్త్యాల కోటిలింగ ఆలయ చరిత్ర రేపటి కథనంలో.
దేవ దాయం – అంటే దేవుడి భాగం;
ధర్మ దాయం- అంటే ధర్మ భాగం అని అర్థం. ఈ మాట ప్రకారం-
“దేవదాయ, ధర్మదాయ శాఖ” అనే అనాలి తప్ప- “దేవాదాయ; ధర్మాదాయ శాఖ” అని అనకూడదు. అసలు అలాంటి మాటలే లేవు- అని వివరిస్తూ ఐధాత్రి గతంలో ప్రచురించిన కథనం లింక్:-
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

