మహారాష్ట్రలో ఓ వ్యాపారి ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కళ్లు చెదిరేలా కట్టకట్టలుగా డబ్బు.. బంగారం బయటపడ్డాయి. పన్నుఎగవేత ఆరోపణలు రావడంతో జాల్నాలోని ఓ వ్యాపారి ఇళ్లు, ఆయనకు సంబంధించిన రెండు గ్రూపుల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ఆ తనిఖీల్లో అధికారులు రూ.56 కోట్ల నగదు, రూ.14 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను గుర్తించారు. మొత్తం 32 కిలోల బంగారం, ముత్యాలు, వజ్రాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు ఇతర ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను, డిజిటల్ డేటాను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
స్టీల్, వస్త్ర, స్థిరాస్థి వ్యాపారాలు చేసే ఓ సంస్థకు సంబంధించిన వ్యాపారవేత్త ఇంట్లో, ఆఫీసులో ఎనిమిది రోజుల పాటు సోదాలు చేశారు. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు నిరంతరాయంగా తనిఖీలు చేశారు. మొత్తంగా రూ.360 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదును యంత్రాల సాయంతో లెక్కించేందుకు 13 గంటలు పట్టింది. ఈ ఆపరేషన్‌లో 25 సంచుల్లో నోట్ల కట్టలను ప్యాక్ చేశారు. తర్వాత ఈ మొత్తాన్ని స్థానిక స్టేట్ బ్యాంకుకు తీసుకెళ్లి లెక్కించారు.
పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ రాష్ట్రవ్యాప్తంగా 260 మంది అధికారులతో కూడిన ఐదు టీమ్‌లను సెర్చ్ ఆపరేషన్ కోసం ఏర్పాటు చేసింది. ఈ ఆపరేషన్‌లో 120కి పైగా వాహనాలను వినియోగించినట్టు అధికారులు వెల్లడించారు.
Also Read : 110 కోట్ల కార్వీ ఆస్తులు అటాచ్ చేసిన ఈడి