సుడాన్ పై పట్టుకోసం సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరు వర్గాల జనరల్స్ మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించిటనట్లు తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. గత 48 గంటలుగా జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఆ దేశ సైన్యం, పారా మిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుంచి 72 గంటల పాటు దేశవ్యాప్త కాల్పుల విరమణను అమలు చేసేందుకు అంగీకరించినట్లు బ్లింకెన్ తెలిపారు.
కాల్పుల విరమణ అంగీకారంతో సుడాన్‌లో చిక్కుకున్న విదేశీయులు సురక్షితంగా తమ ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు మార్గం సుగమమైనట్లే. సుడాన్ ఘర్షణల్లో చిక్కుకున్న తమ వారిని రక్షించుకునేందుకు పలు దేశాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ఇరు వర్గాల మధ్య భీకర పోరు నేపథ్యంలో ఆ దేశంలో విమానాశ్రయాలన్నింటినీ మూసేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాల ద్వారా అక్కడ చిక్కుకున్న వారు స్వదేశానికి వచ్చే అవకాశం లేకపోవడంతో పలు దేశాలు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కాల్పుల విరమణ అమలుతో అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి సురక్షితంగా తరలించేందుకు వీలు పడినట్లైంది.
సుడాన్‌పై పట్టుకోసం ఆ దేశ సైన్యం, పారా మిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) మధ్య పది రోజులుగా తీవ్రమైన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు మొత్తం 420 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరో 4 వేల మందికిపైగా గాయపడ్డారు. కాగా, ఈ అంతర్యుద్ధంలో చిన్నారులే ఎక్కువగా బాధితులవుతున్నట్లు యూనిసెఫ్ (UNICEF) ఆందోళన వ్యక్తం చేసింది.
మరోవైపు పేలుళ్లతో సుడాన్‌లోని ప్రధాన నగరాలు దద్దరిల్లుతుండటంతో వేలాదిమంది సుడానీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. కొందరు బాంబు పేలుళ్లు, కాల్పుల నుంచి తప్పించుకునేందుకు ఇండ్లలోనే తలదాచుకుంటున్నారు. మరోవైపు ఆహారం, మంచి నీళ్లు, మందులు, కరెంట్ లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.