Friday, October 18, 2024
HomeTrending NewsBuggana: ఐఐటిల ద్వారా నాణ్యమైన శిక్షణ: బుగ్గన

Buggana: ఐఐటిల ద్వారా నాణ్యమైన శిక్షణ: బుగ్గన

పరిశ్రమలు నాణ్యమైన ఉత్పత్తిని సాధించాలంటే వృత్తి నైపుణ్యత కలిగిన కార్మికుల అవసరం ఎంతైనా ఉంటుందని, ఇందుకు అనుగుణంగా ఐటిఐ, పాలిటెక్నికల్ కళాశాలల సిలబస్ లో సమూల మార్పులు తీసుకురానున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ( ఫ్యాప్సీ) ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023 ప్రధానోత్సవం నగరంలోని నోవాటెల్ హోటల్లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి  బుగ్గన, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బుగ్గన  మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ ఐటిఐలలో అభ్యర్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం లేదని, వాళ్లు కోర్సు పూర్తి చేసుకుని బయటికి వచ్చిన తర్వాత ఏ పరిశ్రమలోనూ పనిచేయటానికి వారి అర్హత సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఐటిఐలను బలోపేతం చేసి, తద్వారా అభ్యర్థులకు నాణ్యమైన సాంకేతిక శిక్షణ అందించాలని నిర్ణయించిందని చెప్పారు. ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలలో ప్రయోగశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. అలాగే ఆయా ప్రాంతాలలోని పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన అభ్యర్థులను తయారు చేసే విధంగా ఐటిఐ, పాలిటెక్నికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక ప్రగతికి ఫ్యాప్సీ ఎంతగానో కృషి చేస్తోందని అన్నారు. పరిశ్రమలకు , ప్రభుత్వానికి మధ్య ఫ్యాప్సీ వారధిగా నిలిచిందని అన్నారు. అలాగే ఆయా పరిశ్రమలు తమ తమ ఉత్పత్తులలో నాణ్యతను పెంచుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, విశ్రాంత సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, ఫ్యాప్సీ అధ్యక్షులు కరుణేంద్ర జాస్తి, మాజీ అధ్యక్షులు సీ.వి అచ్యుతరావు, ఉపాధ్యక్షులు కె.మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.అనంతరం 11 రంగాలలో రాణించిన వారికి ఫ్యాప్సీ ఎక్స్ లెన్స్ అవార్డులు మంత్రులు బుగ్గన, గుడివాడ అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్