ముఖ్యమంత్రిగానే శాసనసభకు వస్తానంటూ చంద్రబాబు శపథం చేశారని… కానీ టిడిపి గెలిచే అవకాశం లేదని.. కాబట్టి ఇకపై ఆయన అసెంబ్లీకి కూడా రాలేరని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు రోజులు పర్యటిస్తే… నాలుగు రోజులు జ్వరం అంటారని, ఆయన రాజకీయాలకు పనికి వచ్చే రకం కాదని తాను ఎప్పుడో చెప్పారని, ఈ ఎన్నికల తర్వాత ఆయన సినిమాలు చేసుకుంటే మంచిదని సలహా చెపారు. పవన్ పై పూలదండలు, పూలు విసరవద్దంటూ జనసేన విడుదల చేసిన ప్రకటనపై అంబటి స్పందించారు. ఈనెల 24న సత్తెనపల్లి వైసీపీ అభ్యర్ధిగా అంబటి, నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. నరసరావుపేట ఎంపి అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు.
పూలు వేయవద్దని, పెద్ద పెద్ద క్రేన్ లతో దండలు వద్దని చెప్పారని… ఆయనకు న్యుమోనియా, జ్వరం ఎప్పుడూ వస్తూనే ఉంటాయని.. మొన్న కూడా జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళారని గుర్తు చేశారు. కేవలం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్న దుర్భుద్ది తోనే రాజకీయాల్లోకి వచ్చి ఆయన కోసమే పార్టీ నడుపుతున్న వ్యక్తి పవన్ అంటూ మండిపడ్డారు. బాబు కోసం కాపు కులాన్ని తాకట్టు పెడుతున్నారంటూ ఎప్పుడో చెప్పానని… ఇప్పటికి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలకు ఇప్పటికి తెలిసి వచ్చిందని, వారంతా పవన్ పై అసహనంతో ఉన్నారని రాంబాబు పేర్కొన్నారు.
ఈనెల 24వ తేదీన నరసరావుపేటలో అనిల్ కుమార్ , సత్తెనపల్లిలో తాను నామినేషన్ దాఖలు చేస్తున్నామని… యాదవ సామాజిక వర్గానికి అరుదైన అవకాశం ఇచ్చారని…. అనిల్ కుమార్ ను గెలిపించుకొని చరిత్రలో నిలిచిపోయేలా నరసరావుపేట రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాలని పిలుపునిచ్చారు.