7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనాతో నేనే మాట్లాడుకుంటూ...

నాతో నేనే మాట్లాడుకుంటూ…

Philosophy of Life:
“జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవీతం నాదీ
సంసార సాగరం నాదె
సన్యాసం శూన్యం నావె

కవినై
కవితనై
భార్యనై
భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటీ జయగీతాల
కన్నీటీ జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ
నాతో నేనే రమిస్తూ
ఒంటరినై
అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని

మింటికి కంటిని నేనై
జంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ
నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని

గాలి పల్లకిలోన తరలి నా పాట పాప ఊరేగె వెడలి
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలి
నా హృదయమె నా లోగిలి
నా హృదయమె నా పాటకి తల్లీ
నా హృదయమె నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి”

Jagamantha Kutumbam Song

కృష్ణవంశి దర్శకత్వంలో చక్రం సినిమాలో సిరివెన్నెల రచన ఇది. చక్రి సంగీతం. శ్రీ గాత్రం. నిజానికి ఇది పాటగా మనకు వినపడడానికి ముందు 24 ఏళ్ల కిందట సిరివెన్నెల రాసి పెట్టుకున్న రచన. సిరివెన్నెల మీద అంతులేని ప్రేమాభిమానాలున్న కృష్ణవంశి ఆ రచనలో అక్షరం ముక్క మార్చకుండా ఆ తాత్విక, మార్మిక, వేదాంత, ఏకాంత అన్వేషణ మార్గానికి సినిమాలో సందర్భం సృష్టించుకుని వాడుకున్నారు. సందర్భానికి పాట రాయడమే గగనం. అలాంటిది సిరివెన్నెల లాంటివారు తమ సొంతానికి రాసుకున్న కవితలే సినిమాలకు, కథాగమనాలకు సందర్భాలు అవుతాయి. జన్మకో శివ రాత్రిలా అయినా ఇలాంటి పాటలను జనానికి ఇస్తున్నందుకు సినిమాలను అభినందించాలి. ఈ పాట రాసిన సిరివెన్నెలకు కోటి దండాలు. ఇలాంటి పాటను మనకిచ్చిన కృష్ణవంశీకి కూడా అర కోటి దండాలు పెట్టకపోతే రుణం తీరదు. ఇదే మాట నేను కృష్ణ వంశీతో అంటే… “ఆ పాట వాడుకోవడం నా అదృష్టం. విన్న ప్రతిసారీ…నా వెంట పడేది. చక్రం కంటే ముందే మురారి, సముద్రం సినిమాల్లో వాడాలని ఎంతగా ప్రయత్నించినా కుదరలేదు. చివరకు చక్రం సినిమాలో…సందర్భాన్ని సృష్టించి…వాడాను. సిరివెన్నెలను మరిపించడానికి సిరివెన్నెలే దిగిరావాలి…” అని పులకింతగా చెప్పుకొచ్చారు.

ఈ పాటకు ప్రతిపదార్థం చెబితే అందం చెడిపోతుంది. సముద్రమంత లోతయిన భావం దాగిన పాట ఇది. ఎవరికి వారు వింటూ ఆ ఒంటరితనం ఏమిటో? ఎందుకో? వారికి వారే అన్వయించుకోవాలి.

చుట్టూ జనం ఉన్నా…మనవారి మధ్యే ఉన్నా…ఎన్నోసార్లు ఏదో తెలియని ఒంటరితనంలో పడిపోతూ ఉంటాం.

చెప్పుకోవడానికి జగమంత కుటుంబం. కానీ…ఏకాకి జీవితం. సాగరమంత సంసారం. కానీ…సన్యాసం. అంతా శూన్యం.

Jagamantha Kutumbam Song

కవి, భార్య, భర్త…పాత్ర ఏదయినా మల్లెల దారిలో పన్నీరయినా, మంచు ఎడారిలో కన్నీరయినా, ఏ తోడూ నీడా లేని నా వెంట నేనే నడుస్తూ…నాతో నేనే మాట్లాడుకుంటూ…నాలో నేనే కలిసిపోతూ…ఒంటరిగా నిత్యం కలలు కంటాను. కథలు అల్లుతాను. మాటల కోటలు కడతాను. పాటకు పట్టం కడతాను. కళ్లకు రంగులు అద్దుతాను. మనసు ముంగిట్లో ముగ్గులు వేస్తాను. కావ్య కన్యను కంటాను.

ప్రపంచాన్ని చూసే కన్ను నేనవుతాను. ఆ కంటి మంటను నేను. మంటల మాటున చల్లని వెన్నెల పూతను నేను. సూర్యుడిని నేను. చంద్రుడిని నేను. పగలు నేను. రాత్రి నేను. కాలానికి పాదాలు నేను. ఆ పాదాలు చేరాలనుకునే కనరాని గమ్యాల ఇంద్రజలాన్ని నేను.

గాలి పల్లకిలో నా పాటల పాప ఊరేగుతూ వెళ్ళడానికి ముందు నా గొంతు వాకిలిని మూసేసింది. ఇప్పుడు మూగగా మిగిలిన నా హృదయమే నాకు ఇల్లు వాకిలి. నా హృదయమే నాకు తల్లి, తండ్రి, భార్య. సమస్తం. చీకటి నిండిన నా హృదయమే నాకు అమావాస్య రోజు సన్నటి రేఖగా కనిపించి..కనిపించని చంద్రుడి కళ- సినీవాలి.

Jagamantha Kutumbam Song

దాదాపుగా ఇదీ పాట భావం. అయితే భావం ఇంతే అనుకుంటే మనం పొరబడినట్లే. మాటలకందని మన ఒంటరితనానికి ఒక తోడు ఈ పాట. మన ఒంటరితనాల అంతులేని ప్రశ్నలకు సమాధానం ఈ పాట. సంసారంలో మన సన్యాసానికి అద్దం ఈ పాట. సన్యాసంలో శూన్యానికి అర్థం ఈ పాట. మనతో మనమే మాట్లాడుకోవడానికి దారి ఈ పాట. మనలో మనమే కలిసిపోతున్నప్పుడు ఓదార్పు ఈ పాట. ఒంటరితనం అంత ఒంటరిది కాదు…ఆ ఒంటరితనంలో విశ్వమంతా దాగి ఉంది అని మనల్ను మల్లెల దారుల్లో…మంచు ఎడారుల్లో…పన్నీటి జయగీతాల్లో…కన్నీటి జలపాతాల్లో…ముంచి…ముంచి…ఒడ్డున పడేసే…సిరివెన్నెలకే సాధ్యమయిన ఏకాంత మహేంద్రజాల గీతమిది.

ఒంటరిగా వింటే ఈ పాట మీకు గుంపు తోడు. గుంపులో వింటే మీరు ఎంత ఎకాకో తెలిపే ఒంటరి పాట ఇది. ఎప్పుడో ఒకప్పుడు మనతో మనమే మాట్లాడుకోవడానికి బాట ఈ పాట. మనలోకి మనమే దూరిపోవడానికి ద్వారం ఈ పాట.  మనతో మనమే  కలసి పోవాల్సిన అద్వైత సిద్ధికి పల్లవి ఈ పాట. ఆలి, సినీవాలి లాంటి మాటలను తాత్విక వేదాంత పారిభాషిక పదాలుగా మలచి జగమంత కుటుంబానికి సిరివెన్నెల ఇచ్చిన పాట. పాటలో ఒక్కొక్క మాట దేనికి ప్రతీకో వెతుక్కుని కన్నీటి జలపాతాల్లో ఈత కొడుతూ పన్నీటి జయగీతాల తీరాలు చేరడానికి మాటసాయం ఈ పాట. తెలుగు సరిగ్గా అర్థం చేసుకోలేని తెలుగువారి గుండెలను కూడా ఊపి…వెంటపడే ఈ పాట గురించి ఎంత రాసినా తక్కువే. ఈ పాట వినాలి. అనుభవించాలి. అంతే.

(పాత వ్యాసానికి కొంత చేర్పుతో)

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: 

సిరివెన్నెల లేని గేయసీమ

Also Read :

తెలుగు సిరి సిరివెన్నెల

Also Read :

సిరివెన్నెలతో.. సరదాగా కాసేపు..

RELATED ARTICLES

Most Popular

న్యూస్