అతి త్వరలో మచిలీపట్నం పోర్టు పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కోర్టులో ఉన్న అడ్డంకులు ఈరోజే తొలగిపోయాయని, దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కోర్టు జడ్జిమెంట్ వచ్చిందని వెల్లడించారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని వరుసగా నాలుగో ఏడాది అమలు చేసింది ప్రభుత్వం. కృష్ణా జిల్లా పెడనలో జరిగిన కార్యక్రమంలో దాదాపు 80వేల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 24వేల రూపాయలు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సిఎం జగన్ మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం చేసే దిశలో తమ ప్రభుత్వం ప్రభుత్వ పదవుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని వివరించారు. విద్యా, వైద్యం, గృహ నిర్మాణ రంగాల్లో తాము చేపట్టిన సంస్కరణలను, విధానాలను వివరించారు.
విపక్ష పార్టీకి ఉన్నట్లు తనకు పత్రికలు, మీడియా సపోర్టు లేదని…. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు మాత్రేమే ఉన్నాయని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశం రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఎన్నో మంచి పనులు చేసుంటే కొందరు జీర్ణించుకోలేని కుట్రదారులు కూడా ఉన్నారన్నారు. అవి మంచి జరుగుతున్నప్పుడు సంతోషించే హృదయాలు కావని, అందుకే రాళ్ళు వేస్తున్నారని విమర్శించారు. దేవుడు తనకిచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలకు మంచి చేయడానికే ఉపయోగిస్తున్నానని, అందుకే చేస్తున్న మంచి మీద, ప్రజలమీద తనకు నమ్మకం ఉందన్నారు. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయనకు వచ్చిన అవకాశాన్ని తనవారికే ఉపయోగించారని ఎదురుదాడి చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పేదల బతుకులు, గ్రామాల రూపు రేఖలు మారుతున్నాయని సిఎం చెప్పారు. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జోగి రమేష్ విజ్ఞప్తి మేరకు పెడన నియోజకవర్గ అభివృద్ధికి 102కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు సిఎం సభా వేదిక నుంచి ప్రకటించారు.
Also Read : 18వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు