Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లో భాగస్వామ్యమై మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబెడతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. కేంద్ర రవాణా, రహదారుల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన సోమవారం వర్చువల్ గా నిర్వహించిన “పీఎం గతిశక్తి” సదస్సులో ఆయన పాల్గొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం ఏపీ చేపడుతున్న చర్యలను, అనుసరిస్తున్న మార్గాలను ఈ సందర్భంగా మంత్రి మేకపాటి వివరించారు.

ఆంధ్రప్రదేశ్ పంచసూత్రాలు :

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుచూపుతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్దికి సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ అమలు పరుస్తోందని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.

1.పోర్టులను అత్యాధునికంగా తీర్చిదద్దడం, జలవాయుమార్గాలను మరింత అభివృద్ధి చేయడం,

2.ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ సహకారంతో టెలికం రంగాన్ని మరింత బలోపేతం చేయడం,

3.విద్యుత్ పునరుత్పాదకతకు సంబంధించి సరికొత్త పద్ధతులను అవలంభించడం, విద్యుత్ పంపిణీ రంగం,

4.పోర్టుల అనుసంధానం, ఉడాన్ స్కీమ్ ద్వారా ప్రాంతీయ వాయుమార్గాల అనుసంధానం,

5.భారతమాల కింద రహదారులను అనుసంధానం చేయడం, సరకు రవాణా మార్గాలను విస్తరించి రవాణా ఖర్చును తగ్గించడం వంటి మౌలిక సదుపాయాలను విస్తృతం చేయడం.

సరకు రవాణా, మౌలిక సదుపాయల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఫైబర్ నెట్, పారిశ్రామిక నోడ్ల అభివృద్ది, కొత్త విద్యుత్ ఉత్పాదక మార్గాలు, రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాలను పెంచడం, సరకు రవాణా ఖర్చును తగ్గించే దిశగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. మారిటైమ్ ఆధారిత సంపదను పెంచడంలో, పోర్టులకు సంబంధించిన వసతులను పెంపొందించడంలో ఏపీ మిగతా రాష్ట్రాల కన్నా ముందుందని మంత్రి తెలిపారు. ఎయిర్ పోర్టులకు అనుసంధానంగా రోడ్లు, రైళ్ల మార్గాలను నిర్మించడం సహా పోర్టుల ద్వారా సముద్ర వాణిజ్య అనుసంధానంలో ఏపీకి తిరుగులేదన్నారు. మల్టీమోడల్ కార్గో హబ్ లు, సహజ వాయువుల పంపిణీ విస్తరణ ద్వారా పారిశ్రామిక, ఆర్థిక ప్రగతిలో ఏపీ దూసుకెళ్లడం ఖాయమన్నారు.

రూ.18వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను, 9 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తోందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. విశాఖ చెన్నై, చెన్నై బెంగళూరు, బెంగళూరు హైదరాబాద్ వంటి 3 పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తూ రాష్ట్రంలోని ప్రతి జిల్లానూ కలుపుతూ యువతకు పెద్దయెత్తున ఉద్యోగవకాశాలతో పాటు రహదారులు, నీటి వసతులు, విద్యుత్ సదుపాయాలను కల్పించే లక్ష్యంతో ఏపీ ముందుకెళుతోందని మంత్రి వివరించారు. ఏపీలో గ్రామ, వార్డు సెక్రటరియేట్ లను నిర్మించి గ్రామ స్థాయిలో పౌరుల ఇంటికే ప్రభుత్వ సేవలను చేరువ చేసి, వసతుల కల్పన ద్వారా అభివృద్ది వికేంద్రీకరణ ఆలోచనను ఆచరణలో చూపడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికతకు నిదర్శనమన్నారు.

ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రపంచంతో పోటీ పడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రశంసించారు. ప్రపంచ బ్యాంక్ 2018లో వెల్లడించిన ర్యాంకింగ్ లలో భారత్ లాజిస్టిక్ పర్ఫామెన్స్ ఇండెక్స్ (ఎల్ పీఐ)లో 44వ స్థానంలో నిలవడం ప్రధాని మోదీ దార్శనికతకు నిదర్శనంగా మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. సరకు రవాణాకు అవుతున్న ఖర్చు అందరికీ తెలుసు. కానీ ఎగుమతులలో ప్రపంచ సగటు 8 శాతంతో పోలిస్తే భారతదేశం ఇప్పటికీ 14శాతం సగటు ఉండడానికి కారణం ఎగుమతులలో ఎవరికీ అందనంత ఎత్తులో భారతదేశం ఉండడమేనని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

“గతిశక్తి”ని అమలుపరచడంలో సంబంధిత శాఖల మంత్రులు, పారిశ్రామికవేత్తల ద్వారా సలహాలు, సూచనల కోసం కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా మౌలిక వసతులను మరింత అభివృద్ది చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసినట్లు తెలిపింది. గత నెల వెస్ట్ జోన్ సమావేశాన్ని నిర్వహించిన భారత ప్రభుత్వం, సోమవారం దక్షిణాది రాష్ట్రాల సమక్షంలో ఈ సదస్సు నిర్వహించింది. ముందుగా పీఎం గతిశక్తికి సంబంధించిన వీడియో ప్రదర్శించడం జరిగింది. రాష్ట్రాలు, కేంద్రం కలిసి ముందుకు సాగాలని కేంద్రం రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది. పీఎం గతిశక్తిపై కేంద్ర సమన్వయం కోసం ప్రతి రాష్ట్రం నుంచి ఒక నోడల్ ఆఫీసర్ ని నియమించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. మార్చి 22 కల్లా రాష్ట్రాలు పీఎం గతిశక్తిపై తమ అభిప్రాయాలు చెప్పాలని ఆదేశించింది.

ఈ కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీ.కే సింగ్, కేంద్ర రవాణ, రహదారుల శాఖ కార్యదర్శి గిరిధర్ ఆరమనే, అదనపు కార్యదర్శి అమిత్ కుమార్ గోష్, కేంద్ర సరకు రవాణా ప్రత్యేక కార్యదర్శి అమృత్ లాల్ మీనా, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్.ఆర్ బొమ్మై, పుదుచ్చేరి రాష్ట్ర సీఎం ఎన్.రంగస్వామి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ శ్రీమతి తమిళసై సౌందర్యరాజన్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, అండమాన్ నికోబర్ , ఆంధ్రప్రదేశ్, కేరళ, లక్ష్యద్వీప్, మహారాష్ట్ర, పొదుచ్చేరి. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు, ఏపీ నుంచి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఏడీసీ ఎండీ భరత్ రెడ్డి, విజయవాడ విమానాశ్రయం జీఎం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com