తమ జెండా ఏ ఇతర జెండాతోనూ జత కట్టదని, ప్రజలే అజెండాగా కొనసాగుతుందని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న దుష్టచతుష్టయాన్ని చిత్తుగా ఓడించడానికి ఈ ఎన్నికల్లో పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా అని అడుగుతూ… దానికి మీ అర్జునుడు సిద్ధంగా ఉన్నాడంటూ ప్రజలనుద్దేశించి అన్నారు. అభివృద్ధి నిరోధకులను, పేదల వ్యతిరేకులను ఓడించడానికి సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. మేమంతా సిద్ధం పేరుతో ప్రొద్దుటూరులో జరిగిన బహిరంగసభలో జగన్ ప్రసంగించారు. మంచికి మద్దతు పలికే ఇంతటి మహా సైన్యం మధ్య వైఎస్సార్సీపీ జైత్రయాత్ర ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసనీ, కానీ తనపై బురదజల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను తనపైకి ఉసిగొల్పి విమర్శలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నాన్నను అతి దారుణంగా చంపి, తానే చంపానని బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న వ్యక్తికి మద్దతిస్తున్నవారిని కూడా ప్రజలు రోజూ చూస్తూనే ఉన్నారని, అలాంటి వ్యక్తి జైల్లో ఉండాలని కానీ, అతనికి వెనకుండి మద్దతు ఇస్తున్నది చంద్రబాబు, ఆయనకు వంతపాడుతున్న ఎల్లో మీడియా కాదా అని నిలదీశారు. తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు.
ఇటీవల వైజాగ్ లో పట్టుబడ్డ డ్రగ్స్ అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. బ్రెజిల్ నుంచి విశాఖకు డ్రై ఈస్ట్ పేరుతో వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో ఆ కంపెనీ యజమానులకు… చంద్రబాబు, ఆయన వదిన… బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి దగ్గరి బంధుత్వం ఉందని, కానీ దాన్ని కూడా తమపై నెట్టి వేయడానికి క్షణాల్లో వీరంతా బయల్దేరిపోయారని ధ్వజమెత్తారు. బాబు నిలబెట్టిన ఎంపి అభ్యర్ధులకు ఈ కంపెనీ తో దగ్గరి బంధుత్వం కూడా ఉందన్నారు.
ఏదైనా తప్పులో దొరకని వారంతా టిడిపి వారు, దొరికిన వారు వైసీపీ వారు.. బతికి ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి శత్రువు, ఆయన చనిపోయిన తరువాతమాత్రం చేసేది శవరాజకీయం… ఇలా తెలుగు గడ్డపై చంద్రబాబు నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు 45 ఏళ్ళుగా మనందరం చూస్తూనే ఉన్నామని జగన్ ఫైర్ అయ్యారు.
తమ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా రావాలని..ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.