Saturday, January 18, 2025
HomeTrending Newsఅభివృద్ధికి బ్రేక్ – అవినీతిలో స్పీడ్ : మోడీ విమర్శ

అభివృద్ధికి బ్రేక్ – అవినీతిలో స్పీడ్ : మోడీ విమర్శ

కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఏపీలో అభివృద్ధి గాడిలో పడుతుందని,  ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఏపీ యువతలో ఎంతో  సామర్ధ్యం ఉందని, టెక్నాలజీ రంగంలో ఏపీ నైపుణ్యాన్ని యావత్ ప్రపంచం గుర్తించిందని ప్రశంసించారు.  కానీ వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధి శూన్యం, అవినీతి వంద శాతం అంటూ వ్యాఖ్యానించారు.  బిజెపి-టిడిపి-జనసేన కూటమి రాజమండ్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. నా ఆంధ్ర కుటుంబ సభ్యులకు నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.

కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందే ఓటమి అంగీకరించారని,  వైఎస్సార్సీపీని ప్రజలు తిరస్కరించబోతున్నారని… ఐదేళ్లుగా వారికి లభించిన అవకాశాన్ని వృథా చేశారని, ఏపీ అభివృద్ధిని అట్టడుగుకు నేట్టేశారని విమర్శించారు.  ఏపీ నుంచి కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ అనే నేగితివితీనుంచి దూరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

చంద్రబాబు హయంలో ఏపీ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటే, వైఎస్సార్సీపీ  హయంలో ఆఖరి స్థానంలోకి వెళ్లిందని అన్నారు. ఏపీని భారీ అప్పుల ఊబిలోకి నెట్టేసిందని అన్నారు. అభివృద్ధికి  ఉన్న ఏకైక గ్యారంటీ ఎన్డీయే అన్నారు. మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వమే మద్యం అమ్ముతోందని,  ఏపీలో మద్యం, ఇసుక  మాఫియా సిండికేట్ నడుస్తోందని. అవినీతి ఫుల్ స్పీడ్ లో ఉంటే, అభివృద్ధి కి బ్రేక్ పడిందని ధ్వజమెత్తారు.

మూడు రాజధానులు అంటూ చెప్పిన వైఎస్సార్సీపీ కనీసం ఒక్క రాజధానిని కూడా పూర్తి చేయలేకపోయిందని, కానీ ఆ పేరు మీద భారీ ఎత్తున అవినీతి జరిగిందని….  ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసిందని దుయ్యబట్టారు. ఆర్ధిక నిర్వహణ ఈ ప్రభుత్వానికి అలవాటు లేదన్నారు.  ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్ళలేకపోతోందని,  కేంద్రం ఈ ప్రాజెక్టుకు 15 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపారు.

పార్లమెంట్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నింటిలో ఎన్డీయే ప్రభుత్వం ఘనవిజయం సాధించబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.  వికసిత ఆంధ్ర ప్రదేశ్… వికసిత భారత్ లో అంతర్భాగంగా ఉండబోతోందని అన్నారు.  రాజమహేంద్రవరం నేల నుంచి, ఈ సభ ద్వారా ఓ కొత్త చరిత్ర లిఖించబోతోందన్నారు.

అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ ఈడీపై ప్రతిరోజూ విమర్శలు చేస్తుందని, కాంగ్రెస్ మంత్రికి సెక్రటరీ ఇంట్లో పనిచేసే వారిపై నోట్ల కట్టల కొండ లభించిందని, ఆ నిధులు లెక్కించడానికి మెషిన్లు కూడా సరిపోలేదని అన్నారు.  దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మే 13న జరిగే ఎన్నికల్లో తమ కూటమికి ఓటు వేయాలని, ఏపీకి మోడీ గ్యారంటీ తో పాటు  చంద్రబాబు సమర్ధ నాయకత్వం, పవన్ కళ్యాణ్ విశ్వాసం కూడా కలగలిపి ఉన్నాయని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్