‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఇటీవల కాలంలో కొత్త కంటెంట్ ను అందించడంలో మరింత స్పీడ్ పెంచినట్టు కనిపిస్తోంది. నిన్ననే ఈ ఫ్లాట్ ఫామ్ పైకి ‘భార్గవి నిలయం’ వచ్చింది. కొంతకాలం క్రితం మలయాళంలో టోవినో థామస్ చేసిన ‘నీలవెలిచం’ సినిమాకి ఇది తెలుగు అనువాదం. ఇది చాలా చిన్న సినిమా. పరిమితమైన పాత్రలతో ఆకట్టుకుంటుంది. దెయ్యం చుట్టూనే కథ తిరుగుతుంది. కానీ ఇంతకుముందు వచ్చిన దెయ్యం సినిమాలకు భిన్నంగా ఇది కనిపిస్తుంది.
ఒక రచయిత ప్రశాంతంగా తన రచనలు సాగించడం కోసం సముద్రతీరంలో ఒక పాడుబడిన బంగ్లాను అద్దెకి తీసుకుంటాడు. ఆ ఇంటిని అతను బాగు చేయించుకుంటూ ఉంటే అక్కడి వాళ్లంతా ఆశ్చర్య పోతారు. ఆ ఇంట్లో దెయ్యం ఉందనీ .. అది అందరిని చంపేస్తూ ఉంటుందని అంటారు. చనిపోయిన యువతి ప్రేమకథను గురించి చెబుతారు. దాంతో అక్కడే ఉంటూ ఆ కథను రాయాలని అతను నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఏం జరుగుతుందనేది కథ.
ఇక ఈ రోజున ‘ఆహా’ నుంచి మరో సినిమా స్ట్రీమింగ్ కి వచ్చింది .. ఆ సినిమా పేరే ‘సింబా’. జగపతిబాబు .. అనసూయ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాతో, మురళీమనోహర్ దర్శకుడిగా పరిచయ మయ్యాడు. ఆగస్టు 9వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి దర్శకుడు సంపత్ నంది నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. ఒక పారిశ్రామిక వేత్తకి సంబంధించిన వారి హత్యలు వరుసగా జరుగుతుంటాయి. ఈ హత్యలకు కారకులు ఒక టీచర్ .. ఒక జర్నలిస్ట్ కావొచ్చునని పోలీసులు భావిస్తారు. కానీ హఠాత్తుగా పురుషోత్తం రెడ్డి పేరు తెరపైకి వస్తుంది. అతని నేపథ్యం ఏమిటి? అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.