బుధవారం తాను సాధించిన మూడు వికెట్లలో కోహ్లి వికెట్ చాలా ప్రత్యేకమైనదని ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు. కోహ్లి క్రీజులో పాతుకుపోతే ఆ తర్వాత అతణ్ణి ఆపడం సాధ్యం కాదని అందుకే ఆ వికెట్ ‘ఎక్స్ ట్రా స్పెషల్’ అంటూ వ్యాఖ్యానించాడు. నిన్నటితో కలిపి ఇప్పటివరకూ మొత్తం ఏడుసారు టెస్ట్ క్రికెట్ లో కోహ్లి వికెట్ సాధించాడు అండర్సన్.
11వ ఓవర్లో తానువేసిన బంతిని కవర్ డ్రైవ్ గా మార్చాలని కోహ్లి ప్రయత్నించాడని, అయితే ఆ బంతి బ్యాట్ అంచుకు తాకి వెనక్కు వెళ్లిందని, ఆ క్యాచ్ ను బట్లర్ ఒడిసి పట్టుకున్నాడని అండర్సన్ వివరించాడు. కోహ్లి క్రీజులో స్థిమిత పడిదే విధ్వంసం సృష్టిస్తాడని అభిప్రాయపడ్డాడు. అందుకే కోహ్లి వికెట్ సాధించినప్పుడు ఎక్స్ ట్రా సంతోషం అనిపించిందని అన్నాడు.
ఆగస్టు 25న బుధవారం ఇండియా- ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదలైన మూడవ టెస్టులో ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే కుప్పకూలింది. కేవలం ఇద్దరు బ్యాట్స్ మెన్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది.