Wednesday, June 17, 2026
HomeTrending NewsJawahar Nagar Dump Yard: కలుషిత వ్యర్ధ జలాలకు శాశ్వత పరిష్కారం

Jawahar Nagar Dump Yard: కలుషిత వ్యర్ధ జలాలకు శాశ్వత పరిష్కారం

జవహర్ నగర్ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తాను చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించబోతున్నది. ఇప్పటికే వ్యర్ధాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న జిహెచ్ఎంసి, గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన లిక్విడ్ వేస్ట్ (లీషెట్) శుద్ధి చేసే ప్రయత్నాలో విజయం సాధించబోతున్నది. ఈ రోజు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించబోయే ఈ లీషెట్ శుద్ధి నిర్వహణ ప్లాంట్ వలన ఇక భవిష్యత్తులో జవహర్ నగర్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నీటి కాలుష్య సమస్య తలెత్తబోదు. ఇప్పటికే జవహర్ నగర్ లో డంప్ యార్డు కేంద్రంగా పేరుకుపోయిన లీషెట్ వలన డంప్ యార్డుకు దగ్గరలో ఉన్న మల్కారం చెరువు వ్యర్ధ జలాలతో నిండిపోయింది. కొన్ని సందర్భాల్లో ఈ కలుషిత నీరు పొంగిపొర్లడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు కాలుష్యం అవుతున్న సమస్యను తెలంగాణ ప్రభుత్వం సవాలుగా స్వీకరించింది. ఈ సమస్యకు సంపూర్ణంగా చెక్ పెట్టడం కోసం సమగ్రమైన పరిష్కార ప్రణాళికను చేపట్టింది.

2017లో ప్రారంభించిన మొబైల్ ఆర్వో సిస్టం ద్వారా రోజుకు రెండు వేల కిలో లీటర్ల కెపాసిటీతో కలిగిన పాక్షిక ట్రీట్మెంట్ పరిష్కారాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత దీన్ని రోజుకు 4000 కిలోలీటర్లకు పెంచడం జరిగింది. దీంతోపాటు అప్పటికే వ్యర్థ జలాలు నిండిన మల్కారం చెరువులోని దాదాపు 11 లక్షల 60 లక్షల కిలో లీటర్ల నీటిని శుద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగాయి. దీంతో పాటు ఈ చెరువులోని వ్యర్ధ జలాలు పొంగిపొర్ల కుండా సుమారు నాలుగు కోట్ల 35 లక్షలతో స్ట్రామ్ వాటర్ డైవర్షన్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసింది. జవహర్ నగర్ డంప్ యార్డ్ పైనుంచి వచ్చే వరద నీటి వలన జరుగుతున్న కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టడం కోసం ముందుగా డంప్ యార్డ్ పైన క్యాపింగ్ పనులను చేపట్టింది. 2020 నాటికి దాదాపు డంప్ యార్డ్ క్యాపింగ్ పనులను జిహెచ్ఎంసి పూర్తి చేసింది.

దీని తర్వాత కలుషిత వ్యర్థ జలాలను సంపూర్ణంగా శుద్ధి చేసేందుకు ఒక సమగ్రమైన పరిష్కారాన్ని సంసిద్ధం చేసిన జిహెచ్ఎంసి, 2020వ సంవత్సరంలో సుమారు 250 కోట్ల రూపాయలతో జవహర్ నగర్ నుంచి వ్యర్థ జలాల ట్రీట్మెంట్ మరియు పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటల రిస్టోరేషన్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో మల్కారం చెరువుతోపాటు అక్కడ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల రిస్టోరేషన్ మరియు శుద్ధి కార్యక్రమాన్ని రాంకీ సంస్థ చేపట్టింది. దాదాపు సంవత్సర కాలంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే 43% మేర మల్కారం చెరువు శుద్ధి పూర్తి అయింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి లాంటి ఏజెన్సీలు కూడా ఈ అంశాన్ని ధ్రువీకరించాయి. మల్కారం చెరువు జలాలను శుద్ధి చేయడం అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్న జిహెచ్ఎంసి దాన్ని మూడుదశలుగా చేపట్టింది. ఇప్పటికే మొదటి దశలో భాగంగా 5.7 ఎకరాల మేర ఉన్న చెరువు నీటిని శుద్ధి చేయడం జరిగింది. పేరుకుపోయిన మురికి శుద్ధి చేసే కార్యక్రమం కొనసాగుతున్నది. వేగంగా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అతి త్వరలో మల్కం చెరువు జలాలు పూర్తిగా శుద్ధి కానున్నాయి.

ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత జవహర్ నగర్ ప్రాంతంలో అటు ఘన వ్యర్ధాలతో పాటు జల వ్యర్ధాల నిర్వహణ కూడా సంపూర్ణ సంతృప్తి స్థాయికి చేరుతుంది దీంతో జవహర్ నగర్ మరియు పరిసర ప్రాంతాల్లో కాలుష్య సమస్య పూర్తిగా అరికట్టబడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular