Jaya Ho Elon Musk :
అయినా… మనిషి మారలేదు
ఆతని కాంక్ష తీరలేదు..
మనిషి ఎప్పుడూ తాను గొప్పవాడిననే అనుకుంటాడు. ప్రకృతిని గెలవచ్చనుకుంటాడు. ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చినా సరే, కొత్త నిచ్చెనలు వేస్తూనే ఉంటాడు. ఈ నిచ్చెనలు వేసే వారిలో ముందుంటాడు ఎలాన్ మస్క్. అందుకే ఈ తరం శాస్త్రజ్ఞులకు అతనంటే ఆరాధన. అతను ప్రపంచాన్ని మార్చగలడని నమ్మేవాళ్ళు ఎందరో. టెస్లా కంపెనీ ద్వారా చిన్నవయసులోనే తన ఆవిష్కరణలతో ప్రపంచ కుబేరుల్లో ఒకడయ్యాడు. తాజాగా అతను ప్రకటించిన ‘న్యూరో లింక్ ‘ ప్రాజెక్ట్ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ ఏమిటీ న్యూరో లింక్?
మెదడులో ఒక మూల చిన్న చిప్ అమరుస్తారు. అంతే, అప్పటినుంచి మెదడు మనం వాడే అన్ని యంత్రాలతో అనుసంధానమవుతుంది. తలచుకోగానే కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి. పాతాళభైరవి కథ గుర్తొస్తోందా? అయితే మన సినీ దర్శకులు ఎప్పుడో ఊహించారన్నమాటే. ఇటీవలే న్యూరా లింక్ ప్రాజెక్ట్ లో చిప్ అమర్చిన కోతి పింగ్ పాంగ్ ఆట ఆలోచనతో ఆడటాన్ని వీడియో గా విడుదల చేశారు. అతి త్వరలో మనుషులపై ప్రయోగాలు ప్రారంభిస్తారు. ఇందులో చిన్నపాటి ఆపరేషన్ ద్వారా మెదడులో చిప్ అమర్చి దాని ఎలక్ట్రోడ్లని లోపలికి లింక్ చేస్తారు. ఈ చిప్ వైర్ లెస్ పద్ధతి లో ఛార్జ్ అవుతుంది. కళ్ళతోనే స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ ఆన్ చెయ్యచ్చు.
ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఆలోచన ద్వారా యంత్రాల్ని మాత్రమే కాదు, అల్జిమర్స్, డెమెన్షియా, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు, నరాలు చచ్చుపడినవారు, పక్షవాతం వచ్చినవారు ఆరోగ్యం మెరుగు పరచుకోడానికీ పనికి వస్తుందంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమస్యలు, డిప్రెషన్ వంటివి కూడా ఆలోచనతో నియంత్రించవచ్చంటున్నారు. ఈ ప్రాజెక్టును అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మెచ్చుకుంది. అంచేత మానవులపై ప్రయోగాలకు అనుమతి తధ్యమని మస్క్ బృందం అనుకుంటోంది. వీటిలో పాల్గొడానికి ఎందరో తహతహలాడుతున్నారు కూడా. రోబోలపై ఆధారపడటం కన్నా ఇదే మేలంటున్నారు ఎలాన్ మస్క్ . చెప్పేవాడు మస్క్ కాబట్టి వినాల్సిందే మరి. ప్రపంచాన్ని వణికిస్తున్న అనేక ఆరోగ్య సమస్యలపై దృష్టి పడలేదేంటి చెప్మా!
-కె. శోభ