Monday, January 20, 2025
HomeTrending Newsబీహార్ లో కొత్త కూటమి ?

బీహార్ లో కొత్త కూటమి ?

బీహార్ లో రాజకీయాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. బీహార్ లో బీజేపీ కూటమితో జేడీయూ తెగదెంపులు చేసుకునేందుకు రంగం సిద్దమైంది.  అలాగే 16మంది బీజేపీ మంత్రులు రాజీనామా చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం సీఎం నితీష్ కుమార్ గవర్నర్ పఘు చౌహాన్ ను కలవనున్నారు. ఈ రోజు పాట్నాలో నితీష్ నివాసంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు హాజరయ్యారు. సమావేశం అనంతరం సిఎం నితీష్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు.

బీహార్‌ పాలిటిక్స్‌… ఎన్డీఏ కూటమిలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ బీజేపీతో తెగతెంపులకు సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ ఆధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్‌ సమావేశానికి నితీష్‌ గైర్హాజరు కావడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో ఫోన్‌లో చర్చించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఎన్డీఏలో సంక్షోభం ముదరడానికి జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి RCP సింగ్‌ రాజీనామాయే కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆర్జేడీ సానుకూల వైఖరిని ప్రదర్శిస్తుండగా బీజేపీతో నితీష్‌ కటీఫ్ చెప్పే అవకాశం ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీకి చెందిన కీలక నేత ఉప ముఖ్యమంత్రి తార్‌ కిషోర్‌ ప్రసాద్‌ సీఎం నితీష్‌తో చర్చలు జరపనున్నట్టు బీజేపీ చెబుతోంది. నేడోరేపో సోనియా గాంధీతో బీహార్ సీఎం భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది.

కొద్ది కాలంగా జేడీయూ, బీజేపీ మధ్య దూరం పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. గత నెల నుంచి ఇప్పటివరకు కేంద్రంతో జరిగిన నాలుగు సమావేశాలకు నితీష్‌ దూరంగా ఉన్నాడు. ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగితే ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో పొత్తుపెట్టుకునే అంశంపై నితీష్‌ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. జేడీయూతో కలిసే 2024 సార్వత్రిక, 2025 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్టు ఇటీవల హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. అయితే బీజేపీలో కొందరు ఒంటరిగా పోటీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో కమలనాథులు చివరి క్షణంలో అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న అనుమనాలు నితీష్‌ కుమార్‌లో పెరుగుతున్నాయి. బీజేపీకి దూరంగా ఉండేందుకు జేడీయూ సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో బీజేపీకి 77 స్థానాలు, జేడీయూకు 45 స్థానాలున్నాయి. ఆర్డేడీ కూటమికి 116 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 122 స్థానాలు అవసరం కాగా గతంలో నితీష్‌కు ఇచ్చిన హామీ మేరకు తక్కువ సీట్లు వచ్చినా నితీశ్‎నే సీఎంను చేసింది బీజేపీ.

మరోవైపు రాష్ట్రీయ జనత దళ్, కాంగ్రెస్, వామపక్ష నేతల సమావేశం మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి నివాసంలో జరుగుతోంది. ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై విపక్ష నేతలు చర్చిస్తున్నారు. అటు ఉపముఖ్యమంత్రి తార కిషోర్ ప్రసాద్ నివాసంలో బిజెపి అగ్రనేతల సమావేశం జరుగుతోంది. తాజా పరిణామాలు విశ్లేషిస్తే జేడియు – ఆర్ జెడ్ డి ల నేతృత్వంలో కొత్త కూటమి ఏర్పాటు దిశగా చర్చలు జరుగుతున్నట్టుగా ఉంది. బిజెపి ని నిలువరించేందుకు మహాఘాట్ భందన్ లో నితీష్ ను చేర్చుకునే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : మావోయిస్టు వారోత్సవాలకు సన్నాహాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్