Wednesday, July 3, 2024
HomeTrending Newsజార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ రాజీనామా

జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ రాజీనామా

జార్ఖండ్ లో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు కొలిక్కి వచ్చాయి. ముఖ్యమంత్రి హేమంత సోరెన్ తన పదవికి రాజీమానా చేశారు. బుధవారం రాష్ట్ర గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. భూ కుంభకోణం కేసులో ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఈడీ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నది. ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

JMM సీనియర్ నేత, మంత్రి చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. చంపై సోరెన్‌ను శాసనసభపక్ష నేతగా ఎన్నుకున్నామని జార్ఖండ్‌ మంత్రి బన్నా గుప్తా వెల్లడించారు. చంపై సోరెన్‌ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాలని కోరుతామని చెప్పారు.

రవాణా శాఖ మంత్రిగా ఉన్న చంపై  సోరెన్ సరైకేల్లా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  పదవ తరగతి వరకు చదువుకున్న ఆయనకు ఆయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో శిబు సోరెన్ తో కలిసి చురుకైన పాత్ర పోషించిన సోరెన్.. జార్ఖండ్ టైగర్ గా పేరొందారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 30 గంటలకు పైగా జాడలేకుండా పోయి రాంచిలో ప్రత్యక్షం కావటం సంచలనం సృష్టించింది. ఢిల్లీ నుంచి రాంచికి రోడ్డు మార్గంలో సుమారు 12 వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి రావటం… ఆ మరుసటి రోజు ఈడి విచారణకు హాజరు కావటం.. వెనువెంటనే రాజీనామా వరుసగా జరిగిపోయాయి.

హేమంత్ సోరెన్ నివాసం వెలుపల గుమిగూడడాన్ని పోలీసులు నిషేధించారు. దాదాపు 7,000 మంది పోలీసులను మోహరించారు. రాష్ట్ర నాయకత్వ మార్పు తప్పదనే ఊహాగానాలు ఊపందుకున్న తరుణంలో హేమంత్‌ సోరెన్‌ భార్య కల్పనా సోరెన్‌ కు సీఎం బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు ప్రచారం జరిగింది. హేమంత్ సోరెన్ అధ్యక్షతన రాంచీలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హేమంత్ సోరెన్ భార్య కల్పన కూడా ఈ సమావేశంలో పాల్గొనడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. హేమంత్ సోరెన్‌ అరెస్టై జైలుకు వెళితే ఆయన భార్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే విషయంపై సమావేశంలో చర్చ జరిగినట్టు ప్రచారమైంది.

81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం 31, కాంగ్రెస్ 16 మంది సభ్యులను కలిగివున్నాయి. ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. విపక్ష బీజేపీకి 25, జార్ఖండ్ వికాస్ మోర్చా 3, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 2, ఇతరులు నలుగురు ఉన్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్