మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే నా సంకల్పం. మహిళలు వారి కుటుంబాలను వారే సాదుకునే స్థాయికి రావాలి. మహిళలు బాగుపడితే ఆ కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను సందర్శించి, పరిశీలించి, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో గల కో ఆపరేటివ్ భవనంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని, రాయపర్తి మండలం కాట్ర పల్లి రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని, తొర్రూరులోని మహిళ భవనంలో గల ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని, పాత కోర్టు సమీపంలో గల ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని, తొర్రూరు మండలం, హరిపిరాలలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి శుక్రవారం సందర్శించారు. సర్టిఫికేట్లు పంపిణీ చేశారు.
ఆయా కేంద్రాల వద్ద కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.
సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలోనే మహిళలకు మహర్దశ ఏర్పడింది. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను మంత్రి వివరించారు. మహిళలను పారిశ్రామికంగా అభివృద్ధి పరిచే విధంగా చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి మహిళలకు వివరించారు. మీలాగే మీ పిల్లలు కూడా కష్టాలు పడొద్దు. వారు బాగా చదువుకోవాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మంత్రి చెప్పారు.
శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు వరంగల్ టెక్స్టైల్ పార్కులో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఆ సదుపాయాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎర్రబెల్లి కోరారు. కొడకండ్ల లోను మినీ టెక్స్టైల్ పార్క్ ని ఏర్పాటు చేస్తున్నామని దీనితో స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరకడమే కాకుండా, బొంబాయి, భీమండి, సూరత్ వంటి నగరాలకు వలస పోయిన వారికి ఇక్కడ పునరావాసం లభిస్తుందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.