Sunday, March 15, 2026
HomeTrending Newsకేంద్రంలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి

కేంద్రంలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి

Job Vacancies : దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ రంగాలలో భర్తీ చేయని ఉద్యోగ ఖాళీలు లక్షల సంఖ్యకు చేరుకుంటున్నాయి. ఇది చాలా చిత్రమైన పరిస్థితి అని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అన్నారు. రాజ్యసభలో మంగళవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో భర్తీకాని ఉద్యోగ ఖాళీల గురించి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం 8 లక్షల ఉద్యోగ ఖాళీలు నేటికీ భర్తీ కాలేదని అన్నారు. ఇందులో సైన్యంలోని త్రివిధ దళాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు, రైల్వేలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగ ఖాళీల ప్రకటన, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అసాధారణ జాప్యంతోపాటు రిక్రూట్‌మెంట్‌ కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలు ప్రకటించడంలోను, నియామక ప్రక్రియను పూర్తి చేయడంలో కూడా తీవ్ర జాప్యం చేసుకుంటోందన్నారు. రిక్రూట్‌మెంట్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌ కావడం, వివిధ రిక్రూట్‌మెంట్‌ బోర్డుల్లో జరుగుతున్న అవకతవకలపైన కోర్టుల్లో ఏళ్ళతరబడి కొనసాగుతున్న దావాలు వంటి కారణాలతో ఏడాదిలో పూర్తి కావలసిన నియామక ప్రక్రియ రెండు, మూడేళ్ళు గడిచినా పూర్తి కావడం లేదని విజయసాయి రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో రిక్రూట్‌మెంట్‌ పరీక్షల కోసం ఏళ్ళ తరబడి రేయింబవళ్ళు కష్టపడే యవతీ యువకులను ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ల జారీలోను, నియామక ప్రక్రియలో జరుతున్న అసాధారణ జాప్యం తీవ్ర నిరాశా నిస్పృహలకు గురి చేస్తోందన్నారు. నిర్ణీత కాల వ్యవధిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసిన వైఖరితో లక్షలాది మంది యువతీ యువకుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతోందని విజయసాయి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా ఒక పటిష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టాలని  విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular