Saturday, November 23, 2024
HomeTrending Newsమ‌హారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి షాక్...సీఎల్పీ నేత‌ రాజీనామా

మ‌హారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి షాక్…సీఎల్పీ నేత‌ రాజీనామా

మ‌హారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. సీఎల్పీ నేత బాలాసాహెబ్ థొర‌ట్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. సీఎల్పీ నేత‌గా వైదొల‌గుతున్న‌ట్టు థొర‌ట్ కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు ఈ రోజు (మంగ‌ళ‌వారం) లేఖ రాశారు. మ‌హారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా ప‌టోలెతో తాను క‌లిసిప‌నిచేయ‌లేన‌ని పార్టీ కేంద్ర నాయ‌క‌త్వానికి థొర‌ట్ స్ప‌ష్టం చేశార‌ని ఆయ‌న స‌న్నిహితుడు సోమ‌వారం వెల్ల‌డించారు. తాను బీజేపీతో జతకడుతున్నట్లు చిత్రీకరిస్తూ తనపై దుష్ప్రచారం జరిగిందని చెప్పారు.. మహారాష్ట్రలో నిర్ణయాలు తీసుకునే ముందు తనను సంప్రదించలేదని థోరట్ పేర్కొన్నారు.

ఇటీవల శాసన మండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించిన సత్యజీత్ టంబేకు థోరట్ మేనమామ. అయితే టంబే తండ్రి సుధీర్‌ను కాంగ్రెస్ ఈ ఎన్నికల బరిలో నిలిపింది. సత్యజీత్ టంబే గెలిచిన తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ముందుగానే కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి తెలియజేశానని, అయినప్పటికీ తనకు తప్పుడు ఫారాలను ఇచ్చారని ఆరోపించారు. తన మేనమామ థోరట్‌కు చెడ్డపేరు తీసుకొచ్చేందుకు, తమ కుటుంబాన్ని కాంగ్రెస్‌కు దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

నానా ప‌టోలె వ్య‌వ‌హార శైలికి నిర‌స‌న‌గా సీఎల్పీ నేత‌గా థొర‌ట్ త‌ప్పుకోవ‌డం మ‌హారాష్ట్ర కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం రేపింది. పార్టీలో సీనియ‌ర్ నేతల మ‌ధ్య విభేదాలు ర‌చ్చ‌కెక్క‌డంతో పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి. పార్టీని గాడిన‌పెట్టేందుకు నేత‌ల మ‌ధ్య ఐక్య‌త నెల‌కొనేలా హైకమాండ్ చొర‌వ చూపాల‌ని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్