Ashes Series: సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఏడు వికెట్లకు 258 పరుగులు చేసింది. బెయిర్ స్టో సెంచరీ (103) తో అజేయంగా నిలిచాడు. వికెట్ నష్టపోకుండా 13 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్ మొదటి నాలుగు వికెట్లు త్వరగా కోల్పోయింది. జట్టు స్కోరు 22 వద్ద 6 పరుగులు చేసిన హమీద్… స్టార్క్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అయితే 36 పరుగుల వద్ద ఇంగ్లాండ్ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జాక్ క్రాలే (18) బొలాండ్ విసిరిన చక్కని బంతికి బౌల్డ్ అయ్యాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కూడా బొలాండ్ బౌలింగ్ లోనే స్టీవ్ స్మిత్ పట్టిన క్యాచ్ కు డకౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. డేవిడ్ మలాన్(3) గ్రీన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
ఈ దశలో బెన్ స్టోక్స్ – బెయిర్ స్టో లు కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్ కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 164 వద్ద 66 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ లియాన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన జోస్ బట్లర్ డకౌట్ కాగా, మార్క్ వుడ్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు.
మూడోరోజు ఆట ముగిసే సమయానికి బెయిర్ స్టో-103; జాక్ లీచ్-4 పరుగులతోను క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్, బొలాండ్ చెరో రెండు; స్టార్క్, గ్రీన్, లియాన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
Also Read : యాషెస్ నాలుగో టెస్ట్ : ఆసీస్ 416/8 డిక్లేర్డ్