Show our Shakti: కేంద్ర ప్రభుత్వ పథకాలను సిఎం జగన్ తన సొంత పథకాలుగా చెప్పుకుంటున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్ భవ పథకం అమలు చేస్తోందని, కానీ రాష్ట్రంలో దీన్ని ఆరోగ్యశ్రీ పేరిట జగన్ అమలు చేస్తున్నారన్నారు. కానీ ఆరోగ్యశ్రీ పథకం కింద పక్క రాష్ట్రాల ఆస్పత్రుల్లో చికిత్స అందించడం లేదని, అదే ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అయితే ఐదు లక్షల రూపాయల వరకూ దేశంలో ఎక్కడైనా వైద్యం పొందే వీలు ఉంటుందని నడ్డా వెల్లడించారు.
బిజెపి శక్తి కేంద్రాల ఇన్ ఛార్జ్ ల సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సభకు నడ్డా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ఏడాదిగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గృహ నిర్మాణానికి నిధులు ఇస్తున్నామని చెప్పారు. ఇలాంటి పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రతినెలా చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మూడీ నిర్వహించ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బూత్ కమిటీతో కలిసి వినాలని కోరారు. ఈ సందర్భంగా దేశంలో మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై చర్చిన్చాలన్నారు. గృహ సంపర్క్ ద్వారా ప్రతి ఇంటికీ వెళ్లి బిజెపి సిద్ధాంతాలను వివరించాలని, వారు తమ పార్టీ పట్ల మొగ్గు చూపితే ఆ ఇంటికి స్టిక్కర్ అంటించాలన్నారు.
తమ పార్టీ భవిష్యత్తులో సాధించబోయే విజయాలకు ఈ విజయవాడ సభ నాంది పలుకుతుందన్నారు. విజయవాడ అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతమని, సాంస్కృతిక, పుణ్య భూమి అని పేర్కొన్నారు. దేశంలో రాజకీయంగా మార్పు తెచ్చేందుకే మోడీ పాలన సాగుతోందన్నారు. మన ప్రభుత్వం సాధించిన విజయాలను, తీసుకున్న నిర్ణయాలను ప్రజల వద్దకు స్పష్టంగా తీసుకెళ్లాలని పిలుపు ఇచ్చారు.
6వేల శక్తి కేంద్రాలు ఏర్పాటయ్యాయని, మరో 4 వేల కేంద్రాలు నెలరోజుల్లోగా ఏర్పాటు చేయాలని నేతనలు ఆదేశించారు. రాష్ట్రంలో 46వేల పోలింగ్ బూత్ లు ఉన్నాయని, బూత్ కమిటీల ఏర్పాటులో అన్ని వర్గాలకూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
రెండ్రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి చేరుకున్న నడ్డా సాయంత్రం మేధావులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. రేపు రాజమండ్రిలో జరిగే రణభేరి సభలో పాల్గొంటారు. గన్నవరం విమానాశ్రయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, సునీల్ దియోధర్ తదితరులు స్వాగతం పలికారు.
Also Read : 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు: సోము