Thursday, April 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఒక గంజి...ఒక కన్నోవా

ఒక గంజి…ఒక కన్నోవా

What a Shame:
దీనికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. పాత్రల పేర్లు కూడా అనవసరం.

కట్ చేస్తే…
జంబో హిల్స్ అనస్తీషియా పబ్ ముందు రివీల్ అయిన దృశ్యం. ఒకడు కార్లో ఒకడే వచ్చాడు. రెండో వాడు వాడి కార్లో ముగ్గురితో వచ్చాడు. అంటే వాడితో కలిపి నలుగురు. మొత్తం అయిదుగురయ్యారు. మొదటి కారు గంజి. రెండో కారు కన్నోవా. నగరంలో పేరు మోసిన వివిడియన్ స్కూల్ పిల్లలు 150 మంది అప్పటికే అనస్తీషియా పబ్ లో అనస్తీషియా ఇవ్వకుండానే మత్తులో కైపెక్కి ఊగుతున్నారు. జోగుతున్నారు. అంతా పదిహేనేళ్ల నుండి ఇరవై ఏళ్లలోపు పిల్లలే. వీరి చేష్టలు మేజర్లకే వణుకు పుట్టించేలా ఉన్నా…డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వీరు పాలు తాగే పిల్లలు. అందువల్ల అనస్తీషియాలో అందరితో కలిసి మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా బ్రేక్ లేకుండా సీసాలకు సీసాల పాలు తాగడంతో మత్తెక్కి కాళ్లు పట్టుదప్పి, కళ్లు మూతలు పడుతుండగా…ఎదురుగా ఒక కనేరియా దేశపు అమ్మాయి కనిపించింది. అంతే కళ్లు విప్పారాయి. కాళ్లు స్వాధీనంలోకి వచ్చాయి. నరాల్లో రక్తం ఉరకలెత్తింది.

పిల్లల్లో జంతువులు నిద్రలేచి నాట్యమాడాయి. గంజి కారు ముందు, కన్నోవా కారు వెనుక. కదిలే కారులో కామం పడగవిప్పి బుసలు కొట్టింది. ఆగిన కారులో కామం వంతులు వేసుకుని అనుభవించింది.

మళ్లీ కట్ చేస్తే…
రివీల్ అయిన దృశ్యం. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ కారులో మానానికి కాలం కొలమానానికి అందనంత అవమానం జరిగింది. మైనర్ల కామకేళికి గంజి సిగ్గుపడింది. మేజర్ల అత్యాచారానికి కన్నోవా కన్ను మూసుకుంది.

మళ్లీ కట్ చేస్తే…
వాళ్ళబ్బాయి ఆ సమయంలో ఆవుదూడకు గడ్డి పెడుతున్నాడు. వీళ్ళబ్బాయి ఆ సమయానికి ఇంట్లో దొడ్లు కడుగుతున్నాడు. వీళ్ళెవరూ ఆ సమయంలో అక్కడ లేరు.

సామాన్యుల సందేహాలు:-
మరి కదిలే గంజిలో రేప్ చేసిన పిల్లలు ఎవరు? ఆగిన కన్నోవాలో రేప్ చేసిన పిల్లలు ఎవరు? మహా నగరంలో ఇన్ని లక్షల సి సి టీ వీ కెమెరాల చూపు మధ్య నడిరోడ్లమీద రేపు మాపు జరిగిన రేప్ లో ఉన్నదెవరో తేలడానికి ఎన్ని రేపులు నిన్నలు కావాలి?

ఉపసంహారం:-
గంజి కన్నోవాను రేప్ చేస్తే…పగతో కన్నోవా గంజిని రేప్ చేసింది. గంజికి ఇది ప్రజాప్రతినిధిగా బాధ్యత. కన్నోవాకు ఇది ఆన్ గవర్నమెంట్ డ్యూటీ. ఇది బడి దాటి వెళ్లే పిల్లలకు వివిడియన్ నేర్పిన సంస్కారం. జరిగింది రేప్ కాదు. ఇదొక అసంకల్పిత కామ ప్రకోప చర్య. అంతే.

రోడ్ల మీద గంజి కనపడితే…
కన్నోవా వెంటపడితే…
దేవుడు కూడా మానానికి భరోసా ఇవ్వలేడు.

మానమా!
జాగ్రత్త. జాగ్రత్త.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్